‘నైని’ బొగ్గు బ్లాకులకు లైన్ క్లియర్.. సింగరేణికి దక్కిన బ్లాకుల్లో మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్

by Rajesh |
‘నైని’ బొగ్గు బ్లాకులకు లైన్ క్లియర్..  సింగరేణికి దక్కిన బ్లాకుల్లో మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణికి గతంలో కేటాయించిన ‘నైనీ’ బొగ్గు బ్లాకుల్లో త్వరలోనే తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. ఆరేండ్ల క్రితమే ఈ బ్లాకు సింగరేణికి దక్కినప్పటికీ పలు రకాల అనుమతుల్లో చోటుచేసుకున్న జాప్యం, గత ప్రభుత్వం చొరవ లేని కారణంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో విద్యుత్ శాఖ, సింగరేణి అధికారుల బృందం ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో శుక్రవారం భేటీ అయ్యారు.ఈనెల ఫస్ట్ వీక్‌లో పర్యావరణ అనుమతులు రాగా, ఒడిషా ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులపై డిప్యూటీ సీఎం బృందం చర్చించింది.దీంతో సింగరేణికి పూర్తి స్థాయిలో ఒడిషా ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం హామీ ఇచ్చారు.సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు సైతం జారీచేశారు.భూముల బదలాయింపు,విద్యుత్ సౌకర్యం,రహదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి చొరవతో..

ఒడిషా ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం దొరకడంతో త్వరలోనే బొగ్గు తవ్వకాలు మొదలు పెట్టేందుకు సిద్దం కావాలని సింగరేణికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. వాస్తవానికి ఒడిషాలోని అంగుల్ జిల్లాలో గల నైనీ బొగ్గు బ్లాకులు 2015లోనే నాటి కేంద్ర ప్రభుత్వం సింగరేణికి అప్పగించింది.2017లో ఇవి సింగరేణి చేతికి దక్కాయి.అయితే,మైనింగ్ కోసం కొన్ని అడ్డంకులు రాగా, గత తెలంగాణ ప్రభుత్వం కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి రాతపూర్వకంగానే విజ్ఞప్తి చేసింది.కానీ, పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ అవసరాల దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి అన్ని రకాల అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశారు. అటవీ భూములతో పాటు కొన్ని ప్రైవేటు భూములను సింగరేణికి బదిలీ చేయాలని ఒడిషా సీఎంతో చర్చించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.

స్థానిక యువతకు ఉపాధి..

నైనీ బ్లాకుల్లో తవ్వకాలు ప్రారంభిస్తే స్థానికంగా ఒడిషా యువతకు ఉపాధి లభిస్తుందని,ప్రభుత్వానికి పన్నుల రూపంలో దాదాపు రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందని డిప్యూటీ సీఎం భట్టి అండ్ బృందం ఒడిషా సీఎంకు వివరించారు.దేశంలో విద్యుత్ సమస్య‌కు కూడా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. దీంతో ఏకీభవించిన ఒడిషా సీఎం సంబంధిత అధికారులను అన్ని రకాల అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు.

ఏడేండ్ల తర్వాత మైనింగ్‌లో కదలిక..

2015లోనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నైనీ బొగ్గు బ్లాకులను కేటాయించినా నేటికీ అక్కడ తవ్వకాలు ప్రారంభం కాలేదు.‘నైనీ’గనుల ద్వారా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. సింగరేణికి తెలంగాణలో ఇప్పటికే ఉన్న 39 బొగ్గు గనులతో పాటు 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ కూడా ఉన్నది. దేశంలోని మొత్తం బొగ్గు అవసరాల్లో సింగరేణి వాటా 7.5%.‘నైనీ’ ప్రాజెక్టు తవ్వకాలకు గతేడాది మార్చిలోనే కొన్ని అనుమతులు రాగా, ఈనెల ఫస్ట్ వీక్‌లో ఆ రాష్ట్ర అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చింది. దీంతో సుమారు ఏడేళ్ల తర్వాత అటవీ భూమి సింగరేణికి బదిలీ కావడంతో అక్కడ మైనింగ్ ప్రారంభం కానుంది.ఇక్కడ మైనింగ్ ప్రారంభమైతే ఒడిషాకు రాయల్టీ, జిల్లా మినరల్ ఫండ్, లెవీ రూపంలో ఏడాదికి రూ.600 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి దాదాపు 1,200 మందికి ఉపాధి దొరుకుతుంది.

1,600 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి..

‘నైనీ’లో ఉత్పత్తి అయ్యే బొగ్గుతో అక్కడే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పాలని సింగరేణి ఆలోచిస్తున్నది.దీనికి అవసరమైన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టును సిద్ధం చేసే పని మొదలుపెట్టింది.రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణాకు ఆ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ద్వారా ‘చెండిపాడు-జరగాడ’ రహదారిని అవసరాలకు అనుగుణంగా నిర్మించుకోవడంతో పాటు విస్తరించాల్సి ఉందని సింగరేణి భావిస్తున్నది.అందుకే సింగరేణి యాజమాన్యం గతేడాది డిసెంబరులోనే రూ.35.23 కోట్లను డిపాజిట్ చేసింది. దీనికి తోడు జరగాడ-చెండిపాడు మార్గంలో హై టెన్షన్ లైన్ కోసం అదనంగా మరో రూ.9.25 కోట్లను డిపాజిట్ చేసింది.ఇప్పుడు ఒడిషా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం రావడంతో ఇక మైనింగ్ యాక్టివిటీస్‌ను సింగరేణి ప్రారంభించడమే మిగిలింది. కాగా, ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, విద్యుత్ శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story