‘మూసీ’ ఫైట్‌లో బీజేపీ ఫెయిల్!

by karthikeya |   ( Updated:2024-10-25 02:17:27.0  )
‘మూసీ’ ఫైట్‌లో బీజేపీ ఫెయిల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది.అయితే, ఈ కార్యక్రమం పార్టీకి ఆరంభ శూరత్వంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నేతల పర్యటన కోసం పార్టీ ప్రత్యేకంగా కమిటీలు సైతం ఏర్పాటు చేసుకుంది. ప్రాంతాల వారీగా పర్యటించే వారి జాబితాను సైతం ఖరారు చేసింది. కానీ పలువురు ఎంపీలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పరివాహక ప్రాంతాల పర్యటనలో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు మాత్రమే పర్యటించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, మిగతా ఎంపీలు ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడెం నగేశ్, లక్ష్మణ్ ఈ పర్యటనల్లో పాలు పంచుకోలేదు.

యాక్టివిటీస్‌లో ఆబ్సెంట్‌కు కేరాఫ్‌గా రాజాసింగ్

మూసీ బాధితులకు అండగా నిలవాలని ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ లీడర్లు పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం తొమ్మిది డివిజన్లుగా కేటాయించి ఆయా ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ, ఎంపీ, ఒక రాష్ట్ర నేత, ఒక స్థానిక నేత ఉండాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా కమిటీ వేశారు. ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ మినహా అందరూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించారు. రాజాసింగ్ సిటీలోనే ఉన్నా ఈ యాక్టివిటీకి మాత్రం దూరంగా ఉన్నారు. ఆబ్సెంట్‌కు కేరాఫ్‌గా రాజాసింగ్ మారారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీకి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీలో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం లేదు.

లీడర్ల మధ్య సమన్వయ లోపంతో ప్రోగ్రాం ఫెయిల్!

మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజలకు భరోసా కల్పించాలని పార్టీ తీసుకున్న నిర్ణయానికి పార్టీ నేతలే కట్టుబడి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పేదలను టచ్ చేయాలంటే ముందు బీజేపీ నేతలపై నుంచి బుల్డోజర్లు పోవాలని విమర్శలు చేయడం వరకే వరకే పరిమితమయ్యారని చర్చించుకుంటున్నారు. గంభీర వ్యాఖ్యలు తప్పితే అనుకున్న స్థాయిలో పర్యటనలు చేసి భరోసా కల్పించింది లేదని చెబుతున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం వల్ల సైతం ఈ ప్రోగ్రామ్‌ను అనుకున్నంత స్థాయిలో సక్సెస్ చేయలేకపోయారని టాక్. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో నేతలకు కేటాయించిన డివిజన్లలో పర్యటనలు నిర్వహించకపోవడంపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇలా అయితే గెలిచేదెలా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

నేడు బీజేపీ మహాధర్నా

మూసీ పునరుజ్జీవనం పేరిట ఏండ్లకు పైగా నివసిస్తున్న పేద ప్రజల ఇండ్లను ఏకపక్షంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా కూల్చివేయడాన్ని, చెరువుల పరిరక్షణ పేరుతో హైడ్రా పేరిట సర్కార్ తీసుకున్న ప్రజా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీజేపీ శుక్రవారం మహాధర్నా చేపట్టనుంది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఈ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా కొనసాగనుంది. కాగా, మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని పలువురు కీలక నేతలకు బాధ్యతలు కేటాయించినా ఎంపీలు పెద్దగా పట్టించుకోకపోవడంతో మహాధర్నా సక్సెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కానీ ధర్నా అనుకున్నంత మేర సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed