గురుకులాలతో ‘గులాబీ’ బిజినెస్.. పేద విద్యార్థులనూ వదలని బీఆర్ఎస్

by Y.Nagarani |   ( Updated:2024-10-25 02:50:37.0  )
గురుకులాలతో ‘గులాబీ’ బిజినెస్.. పేద విద్యార్థులనూ వదలని బీఆర్ఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ పాలనలో ప్రవేశ పెట్టిన పథకాలు, కాంట్రాక్టుల్లో ఆ పార్టీ నేతలే పెద్ద ఎత్తున లబ్దిపొందారని, అధికారులను బెదిరించో, బుజ్జగించో ప్రయోజనం పొందారనే ఆరోపణలున్నాయి. పేద విద్యార్థులు చదివే గురుకులాలనూ వారు వదల్లేదని తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 80 శాతం గురుకులాలు గులాబీ నేతలకు చెందిన సొంత భవనాల్లోనే నడుస్తున్నట్టు తెలుస్తున్నది. వాటికి మార్కెట్‌లో ఉన్న రెంట్‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా రేట్ ఫిక్స్ చేయించారని సమాచారం. అందుకోసం ఆ పార్టీ నేతలు తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే తాజాగా గురుకులాలకు రెంట్స్ ఇవ్వడం లేదని బిల్డింగ్ ఓనర్లు తాళాలు వేశారు. అసలు ఏ ప్రామాణికంగా వాటిని అద్దెకు తీసుకున్నారు? పాటించిన రూల్స్ ఏంటీ? అనే వివరాలన్నీ ప్రభుత్వం సేకరించగా గులాబీ అద్దె బిల్డింగ్స్ బాగోతం బయట పడిందని ప్రచారం జరుగుతున్నది.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మేనేజ్‌మెంట్ కింద 1,023 గురుకులాలు ఉన్నాయి. ఇందులో కేవలం 361కి మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగతా 662 స్థానికంగా ఉన్న అద్దె బిల్డింగ్స్‌లో నడుస్తున్నాయి. అయితే విద్యార్థులకు అనువుగా ఉండే ప్రయివేటు భవనాలను మాత్రమే అద్దెకు తీసుకోవాలని, అందులోనే హాస్టల్, ఇతర సౌకర్యాలు (మెస్, డైనింగ్, వాష్ రూమ్స్, డార్మిటరీ) వంటివి ఉండాలని నిబంధన ఉన్నది. అద్దె బిల్డింగ్ ఎంపిక చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్, గురుకులం ప్రిన్సిపాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఏ బిల్డింగ్‌ను ఎంపిక చేయాలనే అంశం పూర్తిగా రాజకీయ కోణంలో జరిగేదని ఆరోపణలున్నాయి. అప్పటి జిల్లా మంత్రినో, లేక ఎమ్మెల్యేనో చెప్పిన భవనాన్ని మాత్రమే రేంట్‌కు తీసుకునే వారనే తెలుస్తున్నది. ఒక వేళ అందుకు ఆఫీసర్లు ఒప్పుకోకపోతే బెదిరించి, అద్దె పత్రాలపై సంతకాలు చేయించారనే విమర్శలున్నాయి. దీంతో తమకు ఎందుకొచ్చిన తలనొప్పి అనే భయంతో ఆఫీసర్లు సైతం లీడర్లు చెప్పిన బిల్డింగ్‌లోనే గురుకులాలను నడిపించేందుకు సిద్ధమయ్యారనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.

మార్కెట్ రేట్ కంటే ఎక్కువగా అద్దె

గురుకులాల అద్దె సైతం అప్పటి లీడర్లే ఫిక్స్ చేసినట్టు సమాచారం. సెమీ అర్బన్ ఏరియాలో ఎస్ఎఫ్‌ట్‌కు రూ.8, అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకు రూ.12 అద్దె ఫిక్స్ చేశారు. మార్కెట్‌లో అంత అద్దె లేకున్నా.. పార్టీ లీడర్లకు ప్రయోజనం కల్పించేందుకే ఆ రేట్లు ఫిక్స్ చేసినట్టు ఆరోపణలున్నాయి. బిల్డింగ్స్‌లో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు లేకున్నా ఆఫీసర్లపై ఒత్తిడి పెంచి, అన్నీ ఉన్నట్టు ఒప్పందం చేసుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక్కో బిల్డింగ్‌కు ప్రతినెలా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అదనంగా అద్దె చెల్లిస్తున్న పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తున్నది.

పేరు ఓ చోటు, నడిచేది మరో చోట

బీఆర్ఎస్ లీడర్ల సొంత బిల్డింగ్‌లోనే గురుకులాలు నడిపించాలని అప్పటి ప్రభుత్వం మౌఖికంగా కండీషన్ పెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో చాలా గురుకులాలు కేటాయించిన ప్రాంతాల్లో కాకుండా ఇతర చోట్ల ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. ఆ బిల్డింగ్స్ అప్పటి మంత్రి, ఎమ్మెల్యేలకు చెందిన సొంత భవనాలో, లేకపోతే వారి బంధువులకు చెందినవో ఉండటంతో ఆఫీసర్లు సైతం మౌనంగా ఉండే వారని తెలిసింది. ఎవరైనా అభ్యంతరం చెబితే.. స్థానికంగా అన్ని సౌకర్యాలు ఉన్న బిల్డింగ్ లేదని, అందుకే మరో చోట రెంట్‌కు తీసుకున్నట్టు అధికారులతో చెప్పించే వారని తెలిసింది.

రాజకీయ ప్రోద్బలంతోనే తాళాలు

దసరా సెలవులు ముగించుకొని పిల్లలు ఈ నెల 15న తిరిగి గురుకులాలకు వెళ్లారు. ఐదారు చోట్ల పాఠశాలల గేట్లకు తాళాలు వేసి కనిపించాయి. తమ పెండింగ్ అద్దె చెల్లించిన తర్వాతే తెరుస్తామని బిల్డింగ్ ఓనర్లు డిమాండ్ చేశారు. అయితే ఉన్న పళంగా ఓనర్లు తాళాలు వేయడం వెనుక విపక్ష లీడర్ల ప్రోత్సాహం ఉందని ప్రచారం జరిగింది. అయితే సాధారణంగా బిల్డింగ్ ఓనర్లు ప్రభుత్వంతో గొడవకు దిగరు. కానీ ‘మీరు తాళాలు వేయండి. మీకు ఏం కాదు. మీ వెనుక మేం ఉన్నాం’ అని బీఆర్ఎస్ నేతల నుంచి భరోసా రావడంతో ఓనర్లు తాళాలు వేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే గులాబీ లీడర్లు ముందు రోజు రాత్రి గురుకులాలకు తాళాలు వేయాలని ఓనర్లకు చెప్పినట్టు టాక్.

– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ గురుకులం ఓ మాజీ మంత్రికి చెందిన బంధువు బిల్డింగ్‌లో సాగుతున్నది. గతంలో ఆ భవనం కోళ్ల ఫామ్‌గా ఉండేది. ఆ తర్వాత ఇంజినీరింగ్ కాలేజీకి మార్పు చేశారు. ఆ కాలేజీ మూత పడిన తర్వాత గురుకులానికి అద్దెకిచ్చారు.

– ఓ మాజీ మంత్రికి చెందిన బంధువుకు చెందిన బిల్డింగ్‌కు ఒక్కో ఎస్‌ఎఫ్‌టీకు రూ.12 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. కానీ ఇప్పటికీ అక్కడ మార్కెట్ ధర రూ.7 ఉందని తెలుస్తున్నది.

– ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓ గురుకులాన్ని రాజీవ్ రహదారి పక్కన ఉన్న మండలానికి కేటాయించారు. కానీ ప్రస్తుతం అది వరంగల్ హైవేకు దగ్గరగా ఉన్న ఓ ప్రయివేటు బిల్డింగ్‌లో నడుస్తున్నది.

– ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బీఆర్ఎస్ లీడర్ బంధువు అడ్మిషన్లు రాకపోవడంతో తన ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీని క్లోజ్ చేశారు. దాన్ని ఖాళీగా ఉంచలేక తనకున్న పలుకుబడితో గురుకులానికి అద్దెకు ఇచ్చారు. బిల్డింగ్‌ కావాల్సిన విస్తీర్ణం కంటే ఎక్కువ వైశాల్యంలో ఉంది. అయినా మొత్తం భవనానికి రెంట్ చెల్లిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed