దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ లేనట్లే.. !

by karthikeya |   ( Updated:2024-10-25 02:24:54.0  )
దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ లేనట్లే.. !
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ కు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సంకటంగా మారాయి. దేశవ్యాప్తంగా విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అసలు పార్టీ నేతలతోనే చర్చించేందుకు సుముఖంగా లేరు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సైతం గులాబీ పార్టీ దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో పవర్ లో ఉన్నప్పుడు పార్టీ నేతలు ఉత్సాహంతో ఆయా రాష్ట్రాల పర్యటలకు వెళ్లినా.. అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పార్టీ విస్తరణకు ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తున్నది.

గులాబీ బాస్ లో నైరాశ్యం!

‘అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్’ నినాదంతో దేశంలో బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్నట్లు 2022 డిసెంబర్ 9న పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రైతుచట్టాలపై పంజాబ్, హర్యాన రైతులు చేపట్టిన ఉద్యమంలో మృతిచెందిన వారికి ఆర్థికసాయం అందజేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, ఏపీ, కర్ణాటక, యూపీలో పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు. అదే విధంగా మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 48పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 288 అసెంబ్లీ లోనూ పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీల ఏర్పాటు చేశారు. సోలాపూర్, ఔరంగాబాద్, లాతూర్, విదర్భ, హుమ్నాబాద్, బీవండి, నాందేడ్, గడ్చిరోలి, నాగ్ పూర్, థానే, నాసిక్, కల్యాణ్, బీడ్, పర్బణి, సాంగ్లీ, నాసిక్ ఇలా 16కు పైగా నియోజకవర్గాల్లో ఎక్కువగా తెలుగు ప్రజలు ఉంటున్నారు.

వారంతా కేసీఆర్ చెప్పినమాటలను విశ్వసించి గులాబీపార్టీలో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండువందలకు పైగా వార్డులు, సర్పంచులను కైవసం చేసుకున్నారు. నాగ్‌పూర్ డివిజన్‌లోని భండారా జిల్లాలో అత్యధికంగా 20, విదర్భ, షోలాపూర్‌లోని 15 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 20లక్షలకు పైగా సభ్యత్వాలు చేశారు. నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో పార్టీకి సొంతభవనాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సమయంలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. అధికారం కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా గులాబీ బాస్ నైరాశ్యానికి గురయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. ఆతర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో పోటీ చేయలేదు.

మహారాష్ట్రలో పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ వెనుకంజ వేశారు. కేవలం తెలంగాణపైనే ఫోకస్ పెట్టినప్పటికీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఎక్కువ సెగ్మెంట్లలో మూడోస్థానానికే పరిమితం అయ్యారు. దీంతో డైలమాలో పడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటీఫికేషన్ రిలీజ్ అయింది. అయినప్పటికీ పోటీపై ఆరాష్ట్ర నేతలకు కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మహారాష్ట్ర నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది గులాబీ పార్టీని వీడారు.

మహారాష్ట్ర పార్టీ ఇన్ చార్జి దూరం?

మహారాష్ట్రలో పార్టీ విస్తరణలో భాగంగానే ఆరాష్ట్రంలో తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీ వేశారు. పార్టీ ఇన్ చార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావుకు బాధ్యతలు అప్పగించారు. డివిజన్లకు ఇన్ చార్జులను నియమించారు. అయితే తెలంగాణలో ఓటమితో పార్టీ నేతలకు వంశీధర్ రావు అందుబాటులోకి రావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని మహారాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు. అన్నిపార్టీలు యాక్టీవ్ గా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే, బీఆర్ఎస్ కేడర్ మాత్రం నైరాశ్యంలో పడిపోయింది.

హర్యానాలో పోటీ పోటీ చేసినా..

దేశ రాజధానిలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని 2023 మే 4న కేసీఆర్ ప్రారంభించారు. హర్యానా కురుక్షేత్రకు చెందిన గుర్నామ్ సింగ్ చడూని పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఆయన మొన్న జరిగిన హర్యానా ఎన్నికల్లో పెహోవా సెగ్మెంట్ నుంచి నుంచి పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1170 ఓట్లు మాత్రమే. దీనిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ కు ప్రజల్లో ఆదరణ తగ్గిందనే చర్చ జోరుగా సాగుతున్నది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పోటీచేస్తే ఇవే ఫలితాలు వచ్చే ప్రమాదముందని భావించి పోటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సైతం పోటీపై నోరుమెదపడం లేదు. కేవలం తెలంగాణ అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలపైనే ఫోకస్ పెట్టి విమర్శలు చేస్తున్నారు.

ఓటమి నుంచి బయటపడేందుకు..

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. రాబోయే స్థానిక, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ కేడర్ లో జోష్ నింపాలని భావిస్తున్నది. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నది. అందులో భాగంగానే ప్రభుత్వం చేసే ప్రతి వైఫల్యాన్ని సోషల్ మీడియా, మీడియా వేదికగా ఎండగడుతున్నది. ప్రజల్లోకి వెళ్లి పార్టీపై సానుకూలత పెరిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకే ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టలేదని పార్టీ వర్గాల సమాచారం. కేసీఆర్ సైతం రాష్ట్రంలోనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నేతలకు హింట్ ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed