Kakinada: ప్రభుత్వ చొరవతో స్వదేశానికి కువైట్ బాధితురాలు కుమారి

by Ramesh Goud |
Kakinada: ప్రభుత్వ చొరవతో స్వదేశానికి కువైట్ బాధితురాలు కుమారి
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురైన గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన మహిళ గారా కుమారి రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సురక్షితంగా తిరిగి స్వదేశానికి వచ్చింది. భర్త చనిపోయి, ఇళ్లు గడవటం కష్టమైన పరిస్థితులల్లో తన ముగ్గురు పిల్లల పోషణ, భవిష్యత్తు కోసం ఈమె పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఏజెంట్ ఎం.సుధాకర్ ద్వారా గత మే 1న ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. కువైట్‌లో 30 వేల రూపాయల జీతానికి ఇంటి పనులు చేసేందుకు ఉద్యోగంలో చేరింది.

అయితే తాను పనిచేసే యజమాని తీవ్ర ఇబ్బందు లకు, చిత్రహింసకు గురిచేయడంతో నరక యాతనకు లోనైంది. దేశం కాని దేశంలో తాను పడుతున్న అవస్థలను వీడియోగా చిత్రీకరించి, తన సోదరుడు కర్రిపోతు సూర్యచంద్ర ద్వారా మంత్రి లోకేశ్‌కు పంపింది. హృదయ విదారకమైన ఆమె దీన పరిస్థితికి చలించిన రాష్ర్ట మంత్రులు పవన్ కల్యాణ్, లోకేశ్ కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో చర్చించి ఆమె తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కువైట్ నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకుని తన సొంతూరు యల్లమిల్లిలోని తన ఇంటికి చేరుకుంది. తమ కుటుంబానికి కొండంత అండగా నిలచి ఆదుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌, కలెక్టర్ షణ్మోహన్ కు రుణపడి ఉంటామంటూ గారా కుమారి, ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement

Next Story