హుజూరాబాద్‌లో బెల్ట్ జోరు.. టార్గెట్ కోసం అధికారుల మౌనం

by Aamani |
హుజూరాబాద్‌లో బెల్ట్ జోరు.. టార్గెట్  కోసం అధికారుల మౌనం
X

దిశ, హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణ నడిబొడ్డున పర్మిట్ రూముల మాటున బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. పేరుకు పర్మిట్ రూంకు అనుమతి తీసుకుని అది తాము లీగల్‌గా చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి అనుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున నిర్భయంగా కుర్చీలు, టేబుళ్లు వేసి తిను బండారాలు, చికెన్, మటన్ వంటి మెనూ పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక పర్మిట్ రూమ్ నడుపుకోవాలంటే అందులో ఎలాంటి తినుబండారాలు లేకుండా కుర్చీలు, టేబుళ్లు లేకుండా కేవలం కౌంటర్ వద్దనే నిలబడి మద్యం తాగి పోవాలి. ఇది కూడా కేవలం కౌంటర్ వద్ద 100 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదు.

కానీ ఇక్కడ ఒక్కో పర్మిట్ రూమ్ లో నాలుగు నుంచి ఐదు రూములు, టేబుల్, కుర్చీలు, సర్వీస్ చేయడానికి సిబ్బంది తదితర ఏర్పాటు చేసి బహిరంగంగా నడుపుతున్నారు. ఇవి ఏకంగా అనధికార బార్ల మాదిరిగానే నడుస్తున్నాయి. దీంతో మందుబాబులు ఒక్క పెగ్ తాగి పోయే వారు మోతాదుకు మించి తాగి ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. మరోవైపు సంసారం గుల్ల చేసుకుంటున్నారు. దీంతో చాలామంది సంసారాలు రోడ్డున పడుతున్నాయి. వీరిని ఈ అలవాటుకు గురి చేసిన వారు మాత్రం రూ.కోట్లకు పడగ లెత్తుతున్నారు.

టార్గెట్ కోసం మౌనం...

ఇంత బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు తమకు నెలవారీ విధించే టార్గెట్ కోసం మౌనం వహిస్తున్నారు. వాస్తవంగా హుజూరాబాద్‌లో రెండు బార్లు ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయి. మిగతావి అన్ని వైన్స్‌లు మాత్రమే. వీటిలో ఎలాంటి సిట్టింగ్ ఉండకూడదు. అయినా నిర్భయంగా సిట్టింగులు నడుపుతున్నారు. వీరికి అధికారుల భయం లేదు. సమస్యలపై స్పందించి పోరాడాల్సిన వ్యక్తులు సైతం వీరి అడుగులకు మడుగులు ఒత్తుతూ మద్దతుగా ఉండడంతో వీరి అక్రమాలకు అంతే లేకుండా పోతుంది.

గ్రామాల్లో బెల్ట్ జోరు..

ఇక గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు ఇంత అంత కాదు. ప్రస్తుతం కిరాణా దుకాణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయంగా బెల్ట్ షాపుల వైపు మళ్లుతున్నారు. కూర్చొని సంపాదించే మార్గం బెల్ట్ షాపులను ఎన్నుకుని వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో క్వార్టర్‌పై అదనంగా రూ.40 తీసుకొంటున్నారు. బీర్ పై రూ.40 తీసుకుంటున్నారు. దీంతో రోజుకు ఎంత లేదన్నా చిన్న బెల్ట్ షాప్ అయినా రూ.1500 సంపాదన గ్యారెంటీ కావడంతో వీరు వీటి వైపు మళ్లుతున్నారు.

గ్రామాల్లో కల్తీ మద్యం..

హుజూరాబాద్‌లో సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులు గ్రామాలకు వెళ్లే సరుకులో ఎక్కువగా కల్తీ మద్యం పంపుతున్నట్లు సమాచారం. బ్రాండెడ్ మద్యంలో చీప్ లిక్కర్ కలిపి అమ్ముతున్న విషయమై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసా మూతలు తీసి అందులో చీప్ లిక్కర్ కలుపుతున్నారు. ఇందుకోసం ఇందులో ప్రావీణ్యం ఉన్న ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నట్లు సమాచారం. వీరు రాత్రంతా తమ గోదాముల్లో కల్తీ మద్యం నింపుతూ మళ్లీ యధావిధిగా పెట్టి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో వీరి వ్యాపారం మూడు బీర్లు, ఆరు సీసాలుగా వర్ధిల్లుతుంది.

ఒక్కో క్వార్టర్‌పై రూ.20 అదనం..

బెల్ట్ షాపులకు ఇచ్చే మద్యంలో క్వార్టర్‌కు రూ.20, బీర్ పై రూ.20 ఎక్కువ తీసుకుంటున్నారు. బెల్ట్ షాపుల వారు మరో రూ.20 ఎక్కువ చేసి వారు మద్యం అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఒక్క క్వార్టర్ పై రూ.40 ఎక్కువ చేసి అమ్ముతున్నారు. గ్రామాల్లో విధి లేని పరిస్థితుల్లో ప్రజలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బెల్ట్ షాపులపై ఉద్యమించాలి..

గ్రామాల్లో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపుల జోలికి అధికారులు వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న రేటు కన్న అధికంగా ఒక్కో క్వార్టర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తూ ప్రజల ఒళ్లు, జేబులు ఖాళీ చేస్తున్న విషయంపై మహిళా సంఘాలు పోరాటం చేసి ఎక్కడికక్కడే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed