లైసెన్సుల విధానాన్ని సులభతరం చేయాలి : నడ్డాకు మంత్రి శ్రీధర్ బాబు లేఖ

by M.Rajitha |
లైసెన్సుల విధానాన్ని సులభతరం చేయాలి : నడ్డాకు మంత్రి శ్రీధర్ బాబు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫార్మారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేంద్రమంత్రి నడ్డాకు బుధవారం మంత్రి శ్రీధర్ బాబు లేఖ రాశారు. ప్రపంచానికి భారత్ ఫార్మాసిటీగా మారిందన్నారు. డ్రగ్స్ అభివృద్ధి తయారీ, పరిశోధనలకు హైదరాబాద్ ఉందని, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ హబ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని శ్రీధర్ బాబు తెలిపారు. భౌగోళిక రాజకీయ పరిణామాలు సాధారణంగా ఔషధ రంగంలో ముఖ్యంగా ఔషధ సేవల రంగం కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్(సీఆర్ఓఎస్), కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ రంగం(సీడీఎంఓ)లలో అపారమైన అవకాశాలను సృష్టించాయన్నారు. ఇతర వాటిలో, యూఎస్ ప్రభుత్వ బయోసెక్యూర్ చట్టం భారతీయ ఫార్మా సేవల పరిశ్రమకు మంచి అవకాశాలను సృష్టించిందని తెలిపారు. పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ నుండి తయారీ, నియంత్రణ సమర్పణల వరకు మొత్తం డ్రగ్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ కి అవసరమైన సేవలను అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సీఆర్ఓఎస్ మరియు సీడీఎంఓ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ రెండు ఏటా 10.75% వృద్ధిని నమోదు చేస్తోందని, 2030 నాటికి 2.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. కొన్ని నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరిస్తే ఈ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి మరియు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి భారత్ గమ్య స్థానం అవుతుందని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి తెలంగాణ కట్టుబడి ఉందని, అవకాశాలు మరియు సవాళ్లను అధిగమించేందుకు, వృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన మద్దతు కోసం తాను పరిశ్రమతో అనేక చర్చలు జరిపానన్నారు. డ్రగ్స్ తయారీ కోసం లైసెన్స్ విధానం సులభతరం చేయాలని, ఔషధాల ఎగుమతుల సమయంలో పేర్ల గోప్యత పాటించాలని, ల్యాబ్ కెమికల్స్‌పై కస్టమ్స్ సుంకం తగ్గించాలని, లైసెన్స్ జారీ కోసం స్థిరత్వ డేటా అవసరాలను సానుకూల పర్చడం పలు అంశాలను లేఖలో పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించి ఫార్మారంగం అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Next Story

Most Viewed