బైండోవర్ బేఖాతర్..రహదారిపై మళ్లీ సిట్టింగ్‌లు..

by Aamani |
బైండోవర్ బేఖాతర్..రహదారిపై మళ్లీ  సిట్టింగ్‌లు..
X

దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని తాడికల్ నుండి కొత్త గట్టు వరకు జాతీయ రహదారిపై గల పలు హోటళ్లు, దాబా లలో అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్‌లు నడుపుతున్నారు. కాగా దిశ దినపత్రికలో "సిట్టింగులకు రహదారి "అనే వార్త కథనాన్ని ప్రచురించిన సంగతి విధితమే. దీనికి స్పందించిన స్థానిక కేశవపట్నం పోలీసులు పలువురిని తాసీల్దార్ ముందు బైండోవర్ చేశారు.ఇకనుండి మద్యం సిట్టింగులు నిర్వహించరాదని, నిర్వహిస్తే జరిమానా తో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కానీ సదరు హోటల్ నిర్వాహకులు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. బైండోవర్ మరుసటి రోజు నుండే గుట్టు చప్పుడు కాకుండా మద్యం బాబులకు మద్యం సిట్టింగ్‌లు యథేచ్చగా నిర్వహిస్తున్నారు. చిన్నాచితక హోటళ్లను నిర్వహించుకునే వారు మాత్రం పోలీస్ పవర్ కు భయపడుతూ మద్యాన్ని అనుమతించాలా వద్దా ? అనే సందిగ్ధంలో పడుతున్నట్లు కొంతమంది తెలిపారు.

రాజకీయ, ఆర్థిక పలుకుబడితో దాబా నిర్వాహకులు అనుమానాస్పదంగా వచ్చే వ్యక్తులకు మందు సిట్టింగ్ లేదని మిగతా వారికి మాత్రం మద్యం సిట్టింగ్‌లకు అనుమతిస్తూ ఏం చక్కా సొమ్ము చేసుకుంటున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. బైండోవర్ చేసే సమయంలోనే ఇది మామూలుగా జరిగే తతంగమే మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాము అని ఓ అధికారి అన్నట్లు వినికిడి. దీంతో సాధారణ హోటళ్లు కాస్త సిట్టింగ్ రూములుగా మారిపోయాయి. అంతేకాకుండా శివారులో ఉన్న హోటళ్లను మాత్రమే పోలీసులు టార్గెట్ చేశారని కేశవపట్నం లో నిర్వహించబడుతున్న చాలా హోటళ్లలో మద్యం షరా మామూలుగానే నడిపిస్తున్నారని బాహాటంగానే ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచి ఆకస్మిక తనిఖీలు చేస్తే తప్ప సిట్టింగ్ మహమ్మారిని దూరం చేయలేమేమో అని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed