హిందుత్వంపై విమర్శలు చేయొద్దు.. పగుడాకుల బాలస్వామి స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |
హిందుత్వంపై విమర్శలు చేయొద్దు.. పగుడాకుల బాలస్వామి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిందు ధర్మంపై వ్యంగాస్త్రాలు వద్దని విశ్వహిందు పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. హిందూ విశ్వాసాలపై నమ్మకం లేని వ్యక్తులు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంలో తలదూర్చడం ఏ మాత్రం క్షమార్హం కాదని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అంశంలో నటుడు ప్రకాష్ రాజ్ వ్యంగంగా మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయొద్దంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడడం తగదని ఫైరయ్యారు. లడ్డూ ప్రసాదం విషయంలో కవ్వింపు చర్యలకు దిగి పరువు తీసుకోవద్దని ఘాటుగా స్పందించారు. తప్పును కప్పిపుచ్చే విధంగా మాట్లాడటం తప్పును ఒప్పుకున్నట్టే అవుతుందని, అదేవిధంగా దోషులకు మద్దతిస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుందని బాలస్వామి హెచ్చరించారు.

కల్తీ చేస్తే ఏమవుతుందని, లడ్డూ ప్రసాదం తిన్నవారు ఎవరైనా చనిపోయారా అంటూ ఎన్‌టీకే పార్టీ చీఫ్ సీమాన్ మాట్లాడటంపై తీవ్రంగా బాలస్వామి స్పందించారు. హిందువుల విశ్వాసాలు నచ్చకపోతే మౌనంగా ఉండాలని, కానీ వ్యంగంగా, ఎగతాళి చేసేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రముఖులుగా చలామణి అవుతున్న పెద్దలు హిందుత్వంపై విమర్శలు చేస్తే తగిన రీతిలో జవాబు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బదులిచ్చారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేసి, దాని ద్వారానే హిందూ దేవాలయాల నిర్వహణ కొనసాగాలనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయానికి విశ్వహిందూ పరిషత్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని బాలస్వామి ప్రకటించారు. హిందూ దేవాలయాలపై ఎండోమెంట్ పెత్తనం అవసరంలేదని, అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరహాలోనే హిందూ దేవాలయాల నిర్వహణ హిందువులకే అప్పగించాలనేది తాము ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నామని గుర్తుచేశారు. దేవుళ్లపై విశ్వాసం లేని వ్యక్తులు ఈవోలుగా, బోర్డు చైర్మన్లుగా ఉండటం హిందుత్వానికి తీరని ద్రోహం చేసినట్లు అవుతుందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పేర్కొన్నారు.

Next Story

Most Viewed