బుద్ధుడి బోధనలు అనుసరణీయం : మంత్రి జూపల్లి కృష్ణారావు

by M.Rajitha |
బుద్ధుడి బోధనలు అనుసరణీయం : మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క ప్రాంతాల‌ ప్రమోష‌న్ లో భాగ‌స్వాములు కావాల‌ని యువ‌త‌కు ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. చారిత్రక‌, వార‌స‌త్వ క‌ట్టడాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రకృతి–వన్య ప్రాణులు, సాహస కార్యకలాపాలకు అనువైన ఎన్నో ప్రాంతాలు తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, వాటిని సంద‌ర్శించి ప్రాచూర్యం కల్పించాల‌ని మీడియాను కోరారు. అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క వారోత్సవాల్లో భాగంగా బుద్ధవ‌నం థీమ్ పార్కుకు విస్తృత ప్రచారం క‌ల్పించేందుకు చేప‌ట్టిన ‘రైడ్ టు నిర్వహణ’ బైక్ ర్యాలీని ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మన్ ప‌టేల్ ర‌మేష్ రెడ్డితో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జూప‌ల్లి మాట్లాడుతూ.. తెలంగాణకు విదేశీ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌న్నారు. ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను అంత‌ర్జాతీయ‌ స్థాయి ప్రమాణాల‌తో అభివృద్ధి చేసేందుకు కార్యచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు విస్తృత‌ ప్రచారం చేపట్టిన‌ట్లు చెప్పారు. నాగార్జున కొండ చారిత్రక ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేసి, బౌద్ధ సంస్కృతి వారసత్వాన్ని ఈ తరానికి తెలియజేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమ‌న్నారు. బుద్ధుడి బోధనలు నేటికి అనుసరణీయమ‌ని, నేటి యువత జీవిత లక్ష్యాలను సాధించే క్రమంలో శాంతి, సహనం, కృషి, పట్టుదల వంటివి అలవర్చుకొని, రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండీ ప్రకాష్ రెడ్డి, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed