SBI ATM:కడప జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం

by Jakkula Mamatha |
SBI ATM:కడప జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం
X

దిశ ప్రతినిధి,కడప:కడప నగరంలోని SBI ATM లో భారీ చోరీ చోటు చేసుకుంది. దుండగులు ATM లను గ్యాస్ కట్టర్లతో కట్ చేసి అందులోని నగదును చోరీకి పాల్పడ్డారు. ఒంటిమిట్టలో రూ.36 లక్షలు నగదు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా వున్నాయి. కడప - చెన్నై జాతీయ రహదారిలోని ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌కు 30 అడుగుల దూరంలో SBI ATM ఉంది. గుర్తు తెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున 4.10 గంటలకు ఏటీఎంలో చొరబడ్డారు. ఏ.టి.ఎం లోని సీసీ కెమెరాలకు నల్లటి రంగు స్ప్రే చేశారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో ఏ.టి.ఎంను కట్ చేశారు.

ATMలో ఉన్న రూ.36,19,400లు నగదును దోచుకెళ్లారు. 4.10 గంటలకు ఏ.టి.ఎం లోకి వెళ్లిన దుండగులు, 4.20 నిమిషాలకు బయటకు వచ్చారు. పదే పది నిమిషాల్లో ఈ చోరీకి పాల్పడ్డారు. ఏ.టి.ఎంలో నగదు చోరీ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కడప ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, సీఐ కృష్ణంరాజు నాయక్, ఒంటిమిట్ట ఎస్ఐ శివప్రసాద్, SBI రీజినల్ మేనేజర్ మురళీ నాయక్, జనరల్ మేనేజర్ మల్లికార్జున ,ఒంటిమిట్ట ఎస్.బి.ఐ మేనేజర్ జగదీష్ బాబు లు ఏ.టి.ఎంను పరిశీలించారు. ఈ సంఘటనకు పాల్పడింది అంతరాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట ఎస్.బి.ఐ మేనేజర్ జగదీష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ చోరీకి పాల్పడిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు.

Next Story

Most Viewed