సీజేరియన్ ​చేస్తే లైసెన్స్ ​రద్దు..! కీలక నిర్ణయం దిశగా సర్కార్

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-09 00:00:47.0  )
సీజేరియన్ ​చేస్తే లైసెన్స్ ​రద్దు..! కీలక నిర్ణయం దిశగా సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీజేరియన్లను అధికంగా ప్రోత్సహిస్తున్న ప్రైవేట్​ ఆసుపత్రులను గుర్తించి లైసెన్స్​లను రద్దు చేయాలని సర్కార్​ భావిస్తున్నది. దీనికి సహకరించిన డాక్టర్ల రిజిస్ట్రేషన్లూ క్యాన్సిల్​ చేయాలనుకుంటున్నది. సీజేరియన్​ కు బాధితులే సహకరించారా? లేదా డాక్టర్లు ప్రోత్సహించారా? అని నిర్ధారించిన తర్వాత మాత్రమే దీన్ని అమలు చేయనున్నారు. వీటిని జిల్లా కలెక్టర్​, డీఎమ్​హెచ్​ఓ పరిధిలో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయంపై ప్రస్తుతం ప్రభుత్వం, ఆఫీసర్లలో అభిప్రాయాల సేకరణ జరుగుతున్నది. త్వరలో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నది. న్యాయ పరమైన సలహాలను కూడా తీసుకుంటున్నది. మరోవైపు ఇన్నాళ్లు సర్కార్​ దవాఖాన్లలో సీజేరియన్లు చేస్తే డాక్టర్లకు ఇన్సెంటీవ్​లు వచ్చేవి. ఇక నుంచి ఇవి రివర్స్​ కానున్నాయి. నార్మల్​ డెలివరీలు చేసినోళ్లకు ప్రభుత్వం మూడు వేల నగదు రూపంలో ప్రోత్సాహం ఇవ్వనున్నది. దీని వలన సహజ ప్రసవాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్లు చేసిన ఆసుపత్రులకు చర్యల నుంచి మినహయింపు ఇవ్వనున్నారు. అయితే గర్భిణుల రిపోర్టులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే దీన్ని పరిగణలోకి తీసుకోనున్నారు.

64 శాతం సిజేరియన్లు..

ప్రస్తుతం రాష్ట్రంలో 64 శాతం సిజేరియన్లు, 36 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. వీటిలో కరీంనగర్​, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా సీ సెక్షన్లు జరుగుతున్నట్లు ప్రభుత్వం నివేదిక తయారు చేసింది. దేశంలో ఈ స్థాయిలో సిజేరియన్లు మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు. దీని వలన భవిష్యత్ కాలంలో మహిళలకు ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తున్నది. దీనిలో భాగంగా నార్మల్​ డెలివరీలు పెంచేందుకు ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నార్మల్​ డెలివరీలు జరిగేందుకు మిడ్​వైఫరీ ప్రోగ్రాం ద్వారా నర్సులకు శిక్షణ ఇస్తున్నారు. ఇక నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో గైనకాలజిస్టు నెలకు ఎన్ని డెలివరీలు చేశారు? అందులో ఎన్ని సిజేరియన్లు ఉన్నాయి? అనే జాబితాను తయారు చేస్తున్నారు. ప్రతీ సిజేరియన్​కు ప్రభుత్వానికి క్లారిఫికేషన్ ​ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed