సీఎం రేవంత్‌ను కలిసిన మాల మహానాడు నేతలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-26 17:04:13.0  )
సీఎం రేవంత్‌ను కలిసిన మాల మహానాడు నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గత నెల ఇచ్చిన తీర్పును వీలైనంత తొందరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇటీవల కలిసిన మాదిగ సామాజికవర్గానికి చెందిన ప్రజా ప్రతినిదులు, మాజీ నేతలు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రిక్వెస్టు చేశారు. దీనికి కొనసాగింపుగా మాల సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు సచివాలయంలో సీఎం రేవంత్‌ను కలిసి చర్చించారు. వర్గీకరణతో మాల సామాజికవర్గానికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, డాక్టర్ మట్టా రాగమయి, కేఆర్ నాగరాజు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య సైతం వర్గీకరణ అమలుతో జరిగే నష్టం గురించి, సుప్రీంకోర్టు తీర్పు అమలు సమయంలో పాటించాల్సిన విధానాలపై ప్రతిపాదనల రూపంలో వివరించారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో దాన్ని అమలుచేసే క్రమంలో మాల, మాదిగ సామాజికవర్గాలు, వీటి ఉపకులాలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్... కేబినెట్ సబ్ కమిటీని నియమించి అమలు క్రమంలో ఎదురయ్యే సాధకబాధకాలను అన్ని ఎస్సీ కులాలు, ఉపకులాల సంఘాల ప్రతినిధులతో చర్చించి రిపోర్టు సమర్పించాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అన్ని కులాలు, ఉప కులాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు మాల సామాజికవర్గ ప్రజా ప్రతినిధులు, మాల మహానాడు ప్రతినిధులు మీడియాకు వివరించారు.

Advertisement

Next Story