Lagacharla : లగచర్ల కేసులు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ

by Y. Venkata Narasimha Reddy |
Lagacharla : లగచర్ల కేసులు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లగచర్ల దాడి కేసుల(Lagacharla cases)ను నాంపల్లి ప్రత్యేక కోర్టు(Nampally Special Court)కు బదిలీ చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడుల కేసు విచారణ ప్రత్యేక కోర్టులోనే జరుగాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపధ్యంలో లగచర్ల కేసులను వికారాబాద్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు నాంపల్లి కోర్టుకు బదిలీ చేసింది. భూసేకరణ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లింగ్యానాయక్‌, కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై దాడి చేయడంతో పాటు, వారు వచ్చిన ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసినట్టు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఇతర నిందితులకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు పూర్తయ్యాయి. కేసుల విచారణ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలోనే జరగాలని ప్రిన్సిపల్‌ జడ్జి ఆదేశించారు. దాంతో మళ్లీ ఆ కోర్టులో బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగిన లగచర్ల దాడి సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని ఆరోపిస్తూ పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 29 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. మరో 40 మంది పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి తనపై పెట్టిన కేసులను కొట్టి వేయాలన్న పిటిషన్ ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది.

Advertisement

Next Story