Phone Tapping Case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్

by Gantepaka Srikanth |
Phone Tapping Case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్(Phone Tapping Case) చేస్తున్నారని, దమ్ముంటే కెమెరాల ముందు ఈ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సవాల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎంకు బహిరంగ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఓ న్యూస్ సదరన్ సమ్మిట్‌లో పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి దమ్ముంటే నా సవాలు స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్(Phone Tapping Case) చేయడం లేదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్‌లను కూడా ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) విషయంలో నాతోపాటు బహిరంగంగా కెమెరాల ముందు లై డిటెక్టర్ పరీక్షకు రావాలన్నారు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy) అవే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.50 లక్షల బ్యాగుతో పట్టుబడిన రేవంత్ రెడ్డిని దొంగ అనకుంటే ఏమంటారని ప్రశ్నించారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామంటూ చెప్పి ఆరు గ్యారంటీలు కాదు కదా.. హాఫ్ గ్యారంటీలు కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.

దేశంలో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ(Congress party) అన్నారు. బీఆర్ఎస్(BRS) పాలనలో రాజ్యాంగబద్ధంగా పార్టీ శాసనసభాపక్ష విలీనం జరిగిందని తెలిపారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఢిల్లీలో రాజ్యాంగం ప్రతులు పట్టుకొని తమాషా చేస్తారు... కానీ తెలంగాణలో రాజ్యాంగం ఖూనీకి గురైనప్పుడు మౌనం వహిస్తున్నారన్నారు. మొహబ్బత్‌కి దుకాణ్ అని చెప్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యం గురించి మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ బుల్డోజర్ల నుంచి పేద ప్రజలను కాపాడటంపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టాలని హితవు పలికారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అంచనాలు పెరగడంతో బీఆర్ఎస్ ఓటమికి ఉపకారణమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా ఇచ్చినప్పటికీ.. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యాం అన్నారు. శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత అంతర్గతంగా సమీక్షించుకొని ప్రజల కోసం పోరాడటానికి ముందుకు వెళ్తున్నామన్నారు. సాధారణంగా దేశంలో ఎన్నికలు అనేవి.. ఒకరి ఎంపిక కంటే అప్పుడు అధికారంలో ఉన్నవారిని తిరస్కరించడం కోసం జరుగుతుంటాయన్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపిక అనే కంటే మా ప్రభుత్వాన్ని తిరస్కరించారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఏర్పాటు చేసిన పార్టీని తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నాం.. కానీ, కాంగ్రెస్ వల్లే విలీనం జరగలేదు.. అదృష్టవశాత్తు తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అవకాశం మాకు దొరికింది. పదేళ్లలో ఐటీ రంగం నుంచి వ్యవసాయ రంగం దాకా అన్ని రంగాలలో తెలంగాణను అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లామని వెల్లడించారు.

అధికారం శాశ్వతమని మేం ఏనాడూ అనుకోలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని సర్వశక్తులా ప్రయత్నం చేశామని, అందులో విజయం సాధించామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ఉన్నా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో, వారి ఆకాంక్షల కోసం పోరాటం చేయడంలో సంతృప్తిగా సంతోషంగా ఉన్నామన్నారు. కుటుంబ నేపథ్యం వంటి అనేక పాత చింతకాయ పచ్చడి విమర్శలు చేసిన అనంతరం కూడా మంత్రిగా విజయవంతంగా తన బాధ్యతలు నిర్వహించినప్పుడు అసంబద్ధమైన, అసత్యమైన విమర్శలు చేయడం అలవాటుగా మారిందన్నారు. అందుకే నాపై అహంకారి వంటి అర్థంలేని విమర్శలను కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు. నాపై కొన్నిపక్షాలు చేస్తున్న అవినీతి, అహంకారం వంటి విమర్శలను రుజువు చేయాలని సవాలు విసిరారు. ప్రజలు ప్రభుత్వ పరిపాలన వంటి అంశాల్లో బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వస్తారని, కచ్చితంగా మా ప్రభుత్వం.. కాంగ్రెస్, బీజేపీల కన్నా గొప్పగా పనిచేసిందన్నారు. రాజకీయాల్లో గెలుపోటముల పట్ల చలించిపోయే తత్వం కేసీఆర్‌ది కాదన్నారు. ఆయన బలమైన మనస్తత్వం, వ్యక్తిత్వం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిందని, కేసీఆర్ నిరంతరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ప్రణాళికలు రచిస్తున్నారని, కానీ అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసిన పార్టీ తీరుపైనా, ఆ పార్టీ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ఆయన ఆవేదన చెందుతున్నారన్నారు. కచ్చితంగా ప్రజలు మరోసారి కేసీఆర్‌కి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇస్తారని విశ్వసిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి ప్రజలు పట్టం కట్టారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కూడా అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగానికి రైతుబంధు, రైతుబీమాతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ఆసరా పెన్షన్లను 2 వేల రూపాయలకు పెంచామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్నీ చేస్తామని చెప్పి ఆశ పెట్టిందని ఆరోపించారు. గ్రామీణ, నగర ప్రాంతాలు అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సమగ్రంగా, సమాంతరంగా అభివృద్ధి చెందాయన్నారు. గత పదేళ్లలో అభివృద్ధి, ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా దృష్టి సారించామని, వాటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం పార్టీకి రెండున్నర దశాబ్దాలుగా నిర్మించుకున్న నాయకత్వం ఉందని, అన్ని గ్రామాల్లో ధృడమైన పార్టీ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉందన్నారు. ఒక్క ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులే లేని పరిస్థితి అని, ముందుగా వాటిని కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. జనాభా నియంత్రణపై దక్షిణ భారతదేశానికి స్పష్టమైన అవగాహన ఉందని, జనాభా తగ్గించుకుని క్రమశిక్షణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ పేరుతో నష్టం చేయడం అన్యాయం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed