ఉద్యమకారుల విషయంలో బీఆర్ఎస్ డిఫెన్స్.. అనూహ్యంగా శంకరమ్మతో లంచ్ మీటింగ్

by GSrikanth |   ( Updated:2024-01-11 14:03:46.0  )
ఉద్యమకారుల విషయంలో బీఆర్ఎస్ డిఫెన్స్.. అనూహ్యంగా శంకరమ్మతో లంచ్ మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఎఫెక్ట్‌తో బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్‌కు దిగుతోంది. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్న గులాబీ పార్టీ గతంలో విస్మరించబడిన వారి విషయంలో బుజ్జగింపులకు దిగుతోంది. తాజాగా అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ విషయంలోనూ బీఆర్ఎస్ బుజ్జగింపుల పర్వానికి దిగినట్లు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శంకరమ్మకు ప్రభుత్వం కీలక పదవి ఇవ్వబోతున్నదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గురువారం శంకరమ్మతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లంచ్ మీటింగ్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

పార్లమెంట్ ఎన్నికల్లో నష్టం తప్పదనేనా?:

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జనవరి 2వ తేదీన సెక్రటేరియట్ లో శంకరమ్మ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టుతో పాటు నామినేటెడ్ భర్తీకి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలని సీఎం భావించినట్లు ప్రచారం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలదని, ముఖ్యంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కు పదవి ఇస్తామని చెప్పి కేసీఆర్ అనేక సందర్భాల్లో మోసం చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే అటుంటి సంప్రదాయనికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన రేవంత్ రెడ్డి ఆమెకు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధం అయ్యారని దీంతో ఆమె కాంగ్రెస్ లో కూడా చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపించారు.

అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ శంకరమ్మ పార్టీ మారితే ఎన్నికల్లో బీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆమె బాటలోనే మిగతా ఉద్యమకారులు సైతం కాంగ్రెస్ వైపు వెళ్తారని ఆందోళన చెందిన బీఆర్ఎస్ శంకరమ్మతో బుజ్జగింపులకు దిగినట్లు తెలుస్తోంది. తన మనవడి పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించేందుకు వచ్చిన శంకరమ్మ కేటీఆర్, హరీష్ రావులు కలిసి భోజనం చేసి పార్టీ మారే విషయంలో తొందరపడవద్దని సముదాయించినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఓ వైపు కొత్త ప్రభుత్వం కీలక పదవి ఇచ్చే యోచనలో ఉందనే ప్రచారం జరుగుతున్న వేళ శంకరమ్మ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed