KTR : నిత్యం అరెస్టుల పర్వమేనా ? : ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం

by Rani Yarlagadda |
KTR : నిత్యం అరెస్టుల పర్వమేనా ? : ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది నుంచీ అడుగుతున్నా ఇవ్వకుండా.. మాజీ సర్పంచులను ఇలా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోందని, ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి సమస్యల్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీఎం, మంత్రులు రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పట్టించుకోకుండా ఊరేగుతున్నారని దుయ్యబట్టారు. సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడేంతవరకూ ప్రభుత్వం స్పందించదా ? అని ప్రశ్నించారు.

సర్పంచులు శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చినా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. తమ హయాంలో పల్లె ప్రగతి పేరున చేపట్టిన కార్యక్రమానికి.. ఈ ప్రభుత్వం తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతోందని యద్దేవా చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన సర్పంచుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పదేళ్లుగా గ్రామపంచాయతీల్లో పేరుకుపోయిన బిల్లులను క్లియర్ చేయాలని, వెంటనే బిల్లుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్ లు పోరుబాటకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని వారంతా ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. వారంతా బంజారాహిల్స్ లోని ఒక హోటల్ లో సమావేశమవ్వగా.. పోలీసులు అక్కడికి చేరుకుని కొందరిని నిర్బంధించారు. మరికొందరిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed