KTR Delhi tour: కేటీఆర్ ఢిల్లీ టూర్.. అసలు మతలబు ఇదేనా?

by Prasad Jukanti |
KTR Delhi tour: కేటీఆర్ ఢిల్లీ టూర్.. అసలు మతలబు ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ‘ఫార్ములా ఈ-రేస్’ కేసు (Formula E is the race case) వ్యవహారం రసవత్తరంగా మారుతున్నది. కేసులో ఇప్పటికే ఏసీబీ రెగ్యులర్ ఎంక్వైరీ ప్రారంభించగా మరోవైపు ఎమ్మెల్యేల అరెస్టు, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన ప్రొసీజర్‌పై గవర్నర్ కార్యాలయం దృష్టి సారించింది. ఈ మేరకు న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారిన వేళ ఈ కేసులో ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కేటీఆర్ హస్తిన టూర్‌పై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. కేంద్రంలోని పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకే ఢిల్లీకి వెళ్లారని అధికార పక్షం పొలిటికల్ పంచులు వేస్తుంటే అప్పుడే వణికిపోతే ఎలా? అంటూ కేటీఆర్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య డైలాగ్ వార్‌తో ఫార్ములా ఈ -రేస్ కాస్తా పొలిటికల్ రేస్‌గా మారింది.

గత ఆరోపణలపైనే ఇప్పుడు హస్తినకు...

‘ఫార్ములా ఈ రేస్’ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచుతున్న క్రమంలో తాను అరెస్టు కాబోతున్నాననే ప్రచారంపై కేటీఆర్ సైతం స్పందించారు. తాను అరెస్టులకు భయపడేది లేదని జైలుకు పంపితే అక్కడ యోగా చేసుకుని, బయటకు వచ్చి పాదయాత్రకు వెళ్తానని వ్యాఖ్యానించారు. అరెస్టు ఖాయం అని తెలిసే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో అనూహ్యంగా కేటీఆర్ అమృత్ పథకం (Amrit Scheme) టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన బావమరిది సృజన్‌రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ గతంలో చేసిన ఆరోపణలపైనే తాజాగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ బయలుదేరడంతో తెలంగాణ పాలిటిక్స్ స్టేట్ టు సెంట్రల్‌కు టర్న్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే కేటీఆర్ నిజంగానే అమృత్ అంశంపై ఫిర్యాదు చేయడానికే వెళ్తారా? లేక ఫిర్యాదు మాటున ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై ఢిల్లీ పెద్దల ప్రసన్నం కోసం వెళ్లారా? అన్న చర్చ షురూ అయింది.

ఏ బాంబు పేలనుందో కేటీఆర్‌కు తెలుసు.. పొంగులేటి

ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రుల వద్ద ప్రాధేయపడి కేసులు వెనక్కి తీసుకోవడానికే వెళ్తున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎవరిని కలిశారో కేటీఆర్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమకు తెలుసని, కేటీఆర్ ఢిల్లీలో ఎవరిని కలిశారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడు రోజుల్లో ఏ బాంబు పేలుతుందో కేటీఆర్‌కు తెలుసని, అందుకే హడావుడిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారని హాట్ కామెంట్స్ చేశారు. మరో మంత్రి పొన్నం (Ponnam prabhakar) స్పందిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని ఆరోపించారు. ఈ-రేస్ కేసులో తనను తాను కాపాడుకునేందుకు కేంద్రం వద్ద మోకరిల్లేందుకే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed