కర్ణాటకలో కిచ్చ సుదీప్.. ఏపీలో రజనీకాంత్.. BJP, TDP స్కెచ్ ఇదే..!

by Sathputhe Rajesh |
కర్ణాటకలో కిచ్చ సుదీప్.. ఏపీలో రజనీకాంత్.. BJP, TDP స్కెచ్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాలకు సినిమా స్టార్ల మద్దతు అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ తెలుగు నాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలను నాడు షేక్ చేశారు. అయితే ప్రతి సారి ఎన్నికల్లో సినిమా స్టార్స్ తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడమో లేక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమో చేస్తూ ఉంటారు.

తమకు నచ్చిన పొలిటికల్ పార్టీకి సమయం వచ్చినప్పుడల్లా బాసటగా నిలుస్తుంటారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చ సుదీప్, సీనియర్ హీరో దర్శన్ లను బీజేపీ ప్రచారంలోకి దించింది. కిచ్చ సుదీప్ వాల్మీకి నాయక కమ్యూనిటీకి చెందిన వారు. ఈ వర్గానికి కర్ణాటకలో ప్రాబల్యం అధికంగానే ఉంది. సుదీప్‌తో ఎన్నికల ప్రచారంతో ఆ సామాజిక వర్గంతో పాటు వారి అభిమానుల ఓట్లు తమకు పడతాయని కాషాయ పార్టీ భావిస్తోంది. అయితే వీరి ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

ఏపీలో రజనీ ఎంట్రీ..

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో పార్టీ పెడతారంటూ జోరుగా ప్రచారం సాగినా ఆరోగ్య సమస్యల కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే ఏపీలో కూడా నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో మెరిసిన రజనీకాంత్ ఎన్టీఆర్, చంద్రబాబులను పొగిడారు. చంద్రబాబు విజన్ అద్భుతమన్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామంతో ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు రజనీకాంత్ టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు. కొడాలి నాని రజనీకాంత్‌పై మండి పడ్డారు. పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీకాంత్ ఎంట్రీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా సూపర్ స్టార్‌పై వైసీపీ దూకుడు కామెంట్స్ టీడీపీకే కలిసొస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రజనీకాంత్ ఎంట్రీతో ఆయన అభిమానులను ఓట్లు‌గా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.

నందమూరి ఫ్యాన్స్, పవన్ ఓటు బ్యాంకు

ఇప్పటికే ఆ పార్టీకి నందమూరి ఫ్యాన్స్ అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా రజనీకాంత్ టీడీపీ సమావేశంలో పాల్గొనడంతో ఇక ఆయన అభిమానులంతా తమ వైపే అనే జోష్‌లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. తమిళ ప్రాబల్యం ఎక్కువగా ఉండే కొన్ని సెగ్మెంట్లలో రజనీకాంత్ చరిష్మా తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి జనసేన రూపంలో పవన్ కల్యాణ్ మద్ధతు ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్ర ప్రదేశ్ విడిపోయాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఈ దఫా కూడా టీడీపీతో పవన్ సానుకూలంగానే ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనియమని పలు సందర్భాల్లో జనసేన చీఫ్ ప్రకటించారు. తద్వారా వైసీపీకి లబ్ధి చేకూరకూడదనేది పవన్ వ్యూహం. ఇక తెలంగాణ విషయానికి వస్తే స్టార్ హీరో విజయ్ దేవరకొండ బీఆర్ఎస్‌కు తొలినుంచి మద్దతు పలుకుతూ వస్తున్నారు. మరి ఏపీలో సూపర్ స్టార్ రజనీకాంత్, కర్ణాటకలో కిచ్చ సుదీప్, సీనియర్ హీరో దర్శన్ ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed