- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ తప్పించే ప్రయత్నం చేసినా మేము వదిలపెట్టం: కిషన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు అంత ఆషామాషీ కేసు కాదని, ఇది చేసిన బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతామని, ఆ పార్టీ గుర్తింపుపై ఎన్నికల కమిషన్ సైతం పునరాలోచన చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భయంకరమైన అంశాలు బయటకు వస్తున్నాయని, కేసీఆర్ కుటుంబం బరితెగించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా వ్యవహరించిందని ఆయన విమర్శలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారుల తీరు విచారణలో బయటపడుతోందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆయన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ నేతల ఫోన్లతో పాటు వ్యాపార వేత్తలు, సమాజంలో ప్రముఖుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
దేశ భద్రతకు విఘాతం కలుగుతుందనే అనుమానం ఉంటే హోం శాఖ కార్యదర్శి నుంచి ముందస్తు అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని, కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణను కేసీఆర్ వాడుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డి కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ ఇటీవల అక్కడక్కడ ఒకరో ఇద్దరివో ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించారని, నిన్నటికి నిన్న తనకేం సంబధమని అంటున్నారని చురకలంటించారు.