Kishan Reddy: కేటీఆర్, రాహుల్ గాంధీ అలా ఊహించుకున్నారు.. కిషన్ రెడ్డి హాట్ కామంట్స్

by Prasad Jukanti |
Kishan Reddy: కేటీఆర్, రాహుల్ గాంధీ అలా ఊహించుకున్నారు.. కిషన్ రెడ్డి హాట్ కామంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రెండు పార్టీల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు రాలేదని ధ్వజమెత్తారు. ఆదివారం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నదని విమర్శించారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ తో స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని బీజేపీకి మెజార్టీ తగ్గడానికి కాంగ్రెస్, మజ్లీస్ స్నేహం కారణం అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాంపల్లిలో ప్రచారం చేయలేదు. ఇంటింటికి కరపత్రాలు పంచలేదు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి లక్ష 2 వేల ఓట్లు వస్తే బీజేపీపై 62 వేల మెజార్టీ సాధించింది. జూబ్లిహిల్స్ సెగ్మెంట్ లోను బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది. దీనికి కారణం మజ్లీస్ అన్నారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పేరు మీద మతోన్మాద శక్తులు పోటీ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారన్నారు. సికింద్రాబాద్ లో పోటీ చేసిన అభ్యర్థి, పోటీ చేసిన గుర్తు కాంగ్రెసే అయినా నిజానికి అక్కడ పోటీలో ఉన్నది ఎంఐఎం పార్టీ అని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నారు. పార్టీ కార్యకర్తలు ఆలోచించాలన్నారు.

కేటీఆర్, రాహుల్ గెలిచినట్లు ఊహించుకున్నారు:

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిచిపోయినట్లుగా కేటీఆర్ ఊహించుకున్నాడని కిషన్ రెడ్డి సెటైర్ వేశారు. అధికారంలోకి వచ్చామని దాంతో ప్రమాణస్వీకారం ఎక్కడ చేయాలి? అతిథులను ఎవరిని పిలవాలి? మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? అని అనేక రకాలుగా ఊహించుకున్నారు. కానీ ప్రజలు ఓడించడంతో ప్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు. అదే మాదిరిగా రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిపోయినట్టుగా తన తాత, నాన్నమ్మ, నాన్న మాదిరిగా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఊహించుకున్నారని ఎద్దేవా చేశారు. కానీ మోడీ గెలవడంతో ఆ అసహనం అంతా మొన్న పార్లమెంట్ లో ప్రదర్శించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో బయటపడుతుందని దేశప్రజలంతా చూడాలని కోరారు.

నెహ్రూ హ్యాట్రిక్ గొప్ప విషయం కాదు:

దేశంలో మిగతా పార్టీలన్ని నామమాత్రంగా ఉన్న సమయంలో జవహర్ లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రధానమంత్రి కావడం గొప్ప విషయమేమి కాదని కానీ ఇప్పుడున్న పోటీ రాజకీయాల్లో నరేంద్ర మోడీ హ్యాట్రిక్ పీఎం కావడం ఆషామాషీ కాదన్నారు. దేశవ్యతిరేక శక్తులు, బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాయి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేసినా ప్రజలు మోడీని విస్వసించారన్నారు. అంబేద్కర్ ను అనేక అవమానాలకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే జమ్ముకాశ్మీర్ లో ఉన్న జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసింది బీజేపీ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ శిరసావహిస్తుందని చెప్పారు. మోడీ గెలవడంతో వ్యతిరేక శక్తులంతా ఇప్పుడు బాధపడుతున్నారు. నరేంద్రమోడీకి మెజార్టీ తగ్గిపోయిందన్న కారణంతో జమ్ములో ఉగ్రవాదం పెరిగిపోయిందన్నారు. ఎప్పటి వరకు బీజేపీ, ఎన్డీయే అధికారంలో ఉంటుందో అప్పటి వరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని అలా కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యకలాపాలు, అవినీతి, కుటుంబ పాలన, పైరవీ రాజ్ వ్యవస్థలు వస్తాయన్నారు. మోడీ వచ్చాకే పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు చిప్పపట్టుకునే స్థితికి తీసుకు వచ్చామన్నారు.



Next Story