కమిషనర్ సస్పెన్షన్ ను అడ్డుకుందెవరు ?

by Sridhar Babu |
కమిషనర్ సస్పెన్షన్ ను అడ్డుకుందెవరు ?
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ కమిషనర్ చింతా వేణు సస్పెన్షన్ ను అడ్డుకుంది ఎవరనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. స్వయానా సీడీఎంఏ డైరెక్టర్ వీపీ గౌతమ్ వైరా మున్సిపాలిటీ కమిషనర్ ను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఆయన ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే కమిషనర్ పై ఎలాంటి వేటు పడకుండా రాజకీయ ఫైరవీలు ముమ్మరంగా నడిపారని వైరాలో ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కమిషనర్లతో ఈనెల 20న సాయంత్రం సీడీఎంఏ వీపీ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మున్సిపాలిటీలోని వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ పని విధానంపై చర్చ జరిగింది. అయితే వైరా మున్సిపాలిటీలోని వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ట్రాకర్ ను యాక్టివేట్ చేయలేదు. వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని తెలుసుకున్న గౌతమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా మున్సిపాలిటీ కమిషనర్ పనితీరుపై మండిపడ్డారు. విధుల పట్ల ఇంత తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటారా అంటూ ప్రశ్నించారు.

జీపీఎస్ ట్రాకర్ ను యాక్టివేట్ చేయటంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైరా మున్సిపాలిటీ కమిషనర్ ను సస్పెండ్ చేస్తున్నామని వీడియో కాన్ఫరెన్స్ లోనే గౌతమ్ ప్రకటించారు. అయితే ఆయన సస్పెండ్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే రాజకీయ ఫైరవీలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీని అడ్డుపెట్టుకొని సస్పెన్షన్ ను ఓ ప్రజాప్రతిని నిలిపివేశారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారి సస్పెన్షన్ ను అడ్డుకున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇటీవల మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ చేసిన తప్పిదాలపై ఆయన్ని వెంటనే సస్పెండ్ చేశారు. అయితే అదే సమయంలో కమిషనర్ సస్పెన్షన్ ను నిలిపివేయటం వివాదాస్పదంగా మారుతుంది. మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరికి ఒక రూల్.... మరొకరికి ఇంకో రూలా అంటూ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే మున్సిపాలిటీ వాహనాల జీపీఎస్ ట్రాకర్ యాక్టివేట్ పై సీడీఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసి 5 రోజులు గడుస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ ను యాక్టివేట్ చేయలేదంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Next Story

Most Viewed