- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crows disappearing : కాకులు కనుమరుగు.. భూమిపై అవి లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఎటు చూసినా కాకులు గుంపులు గుంపులుగా కనిపించేవి. బయట వాకిట్లో ఏ ధాన్యాలు ఆరబోసినా తినేందుకు వచ్చేవి. ఏమాత్రం చూడకపోయినా సగం ఖాళీ చేసేవి. అందుకోసం కాకులను తరిమేందుకు ఎవరో ఒకరు కావలి ఉండేది. ఇక చెరువు గట్లపోంటి, చెలక మళ్లపోంటి ఎక్కడ చూసినా కావ్.. కావ్ మంటూ కాకులు సందడి చేసేవి. పట్టణాల్లో కూడా అక్కడక్కడా కనిపించేవి. ఇప్పుడు పట్టణాలు, గ్రామాలు ఎక్కడ చూసినా మునుపటిలా కనిపించడం లేదంటున్నారు ప్రకృతి ప్రేమికులు. క్రమంగా ఇవి కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అసలు కాకులే కనబడవేమోననే ఆందోళన కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.
జీవ వైవిధ్యంలో కీలకం
చూడ్డానికి నల్లగా ఉంటాయేమో కానీ.. కాకులు జీవ వైవిధ్యంలో తమవంతు పాత్రను పోషించడం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఇటు ప్రజల నమ్మకాల పరంగానూ అవి ముఖ్యమైనవే. ఇంటి ముందు కాకులు అరిస్తే ఎవరో బంధువులు వస్తారని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు. ఎవరైనా ఎక్కువగా అరుస్తుంటే కూడా ఎందుకలా కాకిలా అరుస్తావు అనేవారు లేకపోలేదు. ఇక సనాతన ధర్మంలోనూ కాకులకు ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు నిర్వహించే కర్మలో భాగంగా పిండ ప్రదానం చేసేటప్పుడు కాకులు వచ్చి ఆ పదార్థాన్ని ముడితేనే శుభ సూచకంగా భావిస్తారు. అయితే అవి వచ్చి పిండ ప్రసాదాలను ఆరగించడం కూడా ఇప్పుడు కష్టమైపోయింది. కారణం కాకులు కనుమరుగై పోతున్నాయ్.
కాకుల ప్రాధాన్యత
ఇటు పాజిటివ్‌గానూ, అటు నెగెటివ్‌గానూ కాకులను ప్రజలు అనేక అంశాల్లో ఉపయోగించుకుంటారు. ఇక కవులు, కళాకారులు కూడా వాటి గురించి చాలానే చెప్పారు. ‘కాకులు నలుపు, కోకిల నలుపు, కాటుక నలుపు, చీకటి నలుపు’ అంటూ అల్లుకున్న పదబందాలు కవిత్వాలుగా జాలువారి ఎంతో మందిని అలరించాయి. ‘‘కాకులవలె నెల్లప్పుడు కలిసి బ్రతుకుట లాభము.. కాట్ల కుక్కలెక్కనెపుడు కలహించుట నష్టము’’ అనే నీతిపద్యాలు కూడా ఎంతో ఆలోచింపజేసేవి. దీనిని బట్టి కాకులు, మనుషులు, పర్యావరణం, ప్రకృతి పరస్పసర ఆధారితాలుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడా పరిస్థితి గతంలోకి మారిపోతోంది.
ఎందుకు కనిపించడం లేదు?
కాకుల సంఖ్య ఏ మేరకు తగ్గిందనడానికి చెప్పదగ్గలెక్కలేవీ లేవు కానీ.. గతంతో పోలిస్తే చాలా వరకు కనుమరుగయ్యాయి. బయట పరిసరాల్లో అవి కనిపించకపోవడమే ఇందుకు చక్కటి ఉదాహరణగా పక్షి ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు చెప్తున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో పచ్చదనాలు కనిపించకపోవడం, చెట్లను నరికివేయడం, పొడవైన చెట్లు లేకుండా పోవడం వంటి పరిస్థితులు వాటి సహజ ఆవాసాలను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కాకుల సంతానోత్పత్తి తగ్గడానికి కారణం అవుతోంది. పంట పొలాలపై పిచికారి చేసే రసాయనాలవల్ల అక్కడ అనేక కీటకాలు చనిపోతాయి. వాటిని తినడంవల్ల కూడా కాకుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో వాటి సంతానం తగ్గుతోంది.
లేకపోతే ఏం జరుగుతుంది?
కాకులు జీవ వైవిధ్యంలో, పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తాయి. అవే గనుక పూర్తిగా కనుమరుగైపోతే.. పంటలను తినేసే కీటకాలు, ఫంగస్‌లు పెరిగిపోతాయి. దీంతో చీడ పీడలు పట్టి దిగుబడులు తగ్గడం, ఆహార కొరత ఏర్పడటం వంటి పరిణామాలు సంభవిస్తాయి. అలాగే కొన్ని నమ్మకాలు, విశ్వాసాల ప్రకారం కూడా కాకులు లేకపోవడం ఓ లోటుగా ప్రజలు భావిస్తారు. కాకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని నిపుణులు అంటున్నారు. వాటికి ప్రమాదకరంగా మారే చర్యలను విడనాడాలని, చెట్లు పెంచాలని సూచిస్తున్నారు.