పారాసెటమాల్‌తో సహా 50కిపైగా మందులు నాణ్యత పరీక్షలో ఫెయిల్

by Harish |
పారాసెటమాల్‌తో సహా 50కిపైగా మందులు నాణ్యత పరీక్షలో ఫెయిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మధుమేహం, రక్తపోటు, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లు, యాసిడ్ రిఫ్లక్స్‌ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే 53 మందులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయినట్టు భారత డ్రగ్ రెగ్యులేటర్ బుధవారం వెల్లడించింది. ఈ జాబితాలో విటమిన్ సి, డి 3 మాత్రలు షెల్కాల్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్‌జెల్స్, యాంటీ యాసిడ్ పాన్-డి, పారాసెటమాల్ మాత్రలు ఐపి 500 ఎంజీ, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హై బ్లడ్ ప్రెజర్ డ్రగ్ టెల్మిసార్టన్ వంటి మరెన్నో 53 అత్యధికంగా అమ్ముడవుతున్న మందులు ఉన్నాయి.

ఈ మందులను హెటెరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (HAL), కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్ వంటి దిగ్గజ కంపెనీలు తయారు చేస్తున్నాయి. తాజా నెలవారీ ఔషధ హెచ్చరికలో భాగంగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) 53 ఔషధాలను "నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (NSQ) హెచ్చరిక"గా ప్రకటించింది.

పిల్లలలో తీవ్రమైన బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల కోసం అందించే హైదరాబాద్‌కు చెందిన హెటెరో నుండి తయారైన సెపోడెమ్ ఎక్స్‌పి 50 డ్రై సస్పెన్షన్ కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని పరీక్షలో తేలింది. ఇదిలా ఉంటేప్రజలకు బాగా తెలిసిన మందులు నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడంతో కొన్ని కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ, మందుల తయారీలో అత్యంత నాణ్యత ప్రమాణాలను పాటిస్తామని, లిస్ట్‌లో ఉన్నవి నకిలీ ఉత్పత్తులు అని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నారు.

Next Story