పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

by Sridhar Babu |
పారిశుద్ధ్య  కార్మికుల సేవలు అభినందనీయం
X

దిశ, కొత్తగూడెం : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు నిత్యం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని డీఎంహెచ్ ఓ భాస్కర్ నాయక్ తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కార్మికులకు సూచించారు. కార్మికులంతా వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించుకొని అవసరమైన చికిత్సలు చేయించుకోవాలన్నారు.

నిత్యం పారిశుద్ధ్య చర్యల్లో నిమగ్నమయ్యే కార్మికులు ఆరోగ్య సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ప్రజాసేవలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని వారికి పలు సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రాధాన్యతను ఇవ్వనుందని చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఆయన శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed