కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తాం : పొంగులేటి

by Nagaya |   ( Updated:2023-10-25 07:39:29.0  )
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తాం : పొంగులేటి
X

దిశ, ఖమ్మం రూరల్: దానవాయిగూడెంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు అందజేస్తామని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో బుధవారం యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు వివరించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అధైర్య పడొద్దన్నారు. శీనన్న అన్ని రకాలుగా అండగా ఉంటారని, గ్రామంలో అన్ని రకాల సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. శీనన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

అంతకు ముందు వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట శ్రీకారం సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, యువనేత పొంగులేటి హర్షారెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రూరల్ మండలాధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు హరినాథ బాబు, చల్లా కృష్ణ, కృష్ణ గౌడ్, జల్లి ఉపేందర్, వీరస్వామి, ఐ.రాఘవ, బండి ఉపేందర్, ఆలయ కమిటీ బాధ్యులు కోడెటి శ్రీను, కోటయ్య, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story