వర్ష బీభత్సం...వణికిపోయిన జనం

by Sridhar Babu |

దిశ, ఖమ్మం రూరల్​ : ఖమ్మం రూరల్​ మండలంలో గత శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మునుపెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ముంచెత్తిన వరద తాకిడికి ఖమ్మం రూరల్​ మండలం ఆకేరు పరీవాహక ప్రాంతాలు వణికిపోయాయి. అకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాలైన కస్నాతండా, తనగంపాడు, పిట్టలవారిగూడెం, తీర్థాల, వాల్యతండా, పోలేపల్లి, గోళ్లపాడు, కామంచికల్లు, దానవాయిగూడెం పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో అప్రమత్తమయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది.

సుమారు అకేరు నుంచి ఇరు వైపులా కిలోమీటరుకు పైగా పంట పొలాలు కొతకు గురయ్యాయి. కొన్ని పంటలు ఇసుక మేటలతో తనరూపాన్నే కోల్పోయాయి. ఉప్పెనను తలపించే వరదతో రూరల్​ మండలం ఉక్కిరిబిక్కిరైంది. కూలిన ఇండ్లు..వేలాది ఎకరాల్లో మేటవేసిన పొలాలతో రైతులు కన్నీరు పెడుతున్నారు. తమ పొలాలను యధావిథిగా మార్చుకునేందుకు లక్షల రుపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఫామాయిల్​, మిర్చి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రాన్స్​ఫార్మర్లు సైతం కొట్టుకుపోయాయి. దీంతో పాటు పంట నష్టం అంచనా కూడ లక్షల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయశాఖ ప్రాథమిక సమాచారం ప్రకారం పంట నష్ట వివరాలు..ప్రత్తి - 660 ఎకరాలు, మొక్కజొన్న -50ఎకరాలు, వరి - 1991 ఎకరాలు, మిర్చి - 140 ఎకరాలు, పెసర - 36 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అంచనాలు తయారు చేశారు.

సాయం కోసం ఎదురుచూపులు..

ప్రభుత్వం తమకు జరిగిన లక్షల నష్టాన్ని పూడ్చేందుకు ఆర్థిక సాయం చేస్తుందా అని బాధితులు ఎదురు చూస్తున్నారు. కస్నాతండాకు చెందిన బాణోత్​ లక్ష్మణ్​ తనకు ఉన్న మూడెకరాల భూమిలో కొంత మిర్చి, కొంత వరి పొలం పెట్టాడు. వరదపోటు వలన మిర్చి పంట పూర్తిగా కొట్టుకుపోవడమే కాకుండా కోతకు గురైంది. వరి పంటలో సైతం ఇసుక మేటలు కట్టాయని లక్ష్మణ్​ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికి లక్షకు పైగా ఖర్చు చేసినట్లు వాపొయ్యాడు.

Advertisement

Next Story