100 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు.. తల్లిదండ్రుల డిమాండ్ ఇదే!

by Jakkula Mamatha |
100 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు.. తల్లిదండ్రుల డిమాండ్ ఇదే!
X

దిశ,కొత్తగూడెం రూరల్: లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు విద్యార్థులకు విద్యాబోధన జరుగుతుంది. ఐదు తరగతులకు గాను 100 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఐదుగురు పర్మినెంట్ టీచర్లు ఉండాలి. కానీ ఒక పర్మినెంట్ టీచర్ మరొకరు డిప్యుటేషన్‌పై వచ్చి ఈ పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారు.

ఇటీవల ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టింది. ఈ బదిలీల ప్రక్రియ పూర్తయి రోజులు గడుస్తున్నా ఈ పాఠశాలకు మాత్రం పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల భర్తీ జరగకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉంటేనే వారందరికీ నాణ్యమైన విద్య అందుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలవడంతో పాటు అనేక అవార్డులు సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి పేరున్న పాఠశాలకు ఉపాధ్యాయులు లేకపోవడం బాధాకరంగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

టీచర్లను నియమించాలి..

శ్రీనగర్ ప్రభుత్వ పాఠశాలకు తక్షణమే విద్యార్థులకు అనుగుణంగా పర్మినెంట్ ఉపాధ్యాయులను నియమించాలి. ఉపాధ్యాయుల భర్తీ కోసం స్థానిక ఎమ్మెల్యే కూనంనేనికి, జిల్లా కలెక్టర్‌కు, డీఈఓకు వినతి పత్రాలు ఇచ్చాం. టీచర్లను నియమించాలని కలెక్టర్..విద్యాశాఖ అధికారికి ఆదేశాలు ఇచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జుంకీలాల్, ఎంఈఓ శ్రీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఒక పర్మినెంట్ టీచర్‌తో పాటు మరొక టీచర్ డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. పర్మినెంట్ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

Advertisement

Next Story