వైరా మున్సిపాలిటీలో పెంచిన ఇంటి పన్నుల భారం తగ్గించాలి

by Naresh |
వైరా మున్సిపాలిటీలో పెంచిన ఇంటి పన్నుల భారం తగ్గించాలి
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ఇంటి పన్నుల భారం తగ్గించాలని సీపీఎం నాయకులు కోరారు. నిర్మాణం మధ్యలో అపేసిన సీసీ రోడ్లు డ్రైనేజీ పూర్తి చేయాలని, ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలని, తెల్ల రేషన్ కార్డులు లేని పేద మధ్యతరగతి కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వైరా రింగ్ రోడ్డు నుంచి ప్రదర్శన నిర్వహించి మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, వైరా మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున రావు మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ పరిధిలో లేని విధంగా వైరా మున్సిపాలిటీలో ఇంటి పన్నులు భారీగా పెంచి బలవంతంగా వసూలు చేయడం సరికాదన్నారు.

రెండు గదులు రేకులు ఇంటికి వేలాది రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గంతో చర్చ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం భవన్ యాప్ ద్వారా ఇంటి పన్నులు నిర్ణయించడం వల్ల అధిక భారం పడిన ప్రజలు వందలాదిమంది రోజు మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్, ఇతర అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నులు భారం తగ్గించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రజలు స్వచ్ఛందంగా పోరాటంలో కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో శాసనసభ ఎన్నికలు ముందు నిర్మాణం చేపట్టి మధ్యలో నిలుపుదల చేసిన సీసీ రోడ్లు డ్రైనేజీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉన్న రోడ్డు తవ్వి కంకర రాళ్ళ పోయడం వల్ల ప్రజలు నడవలేని స్థితి ఏర్పడిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తెల్ల రేషన్ కార్డు లేనివారికి కూడా వర్తింపజేయాలని కోరారు.

ఇంటి పన్నులు రివైజ్ చేస్తాం : కమిషనర్ వేణు హామీ

వైరా మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద సీపీఎం, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళన చేయడంతో విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ కమిషనర్ వేణు ధర్నా వద్దకు వచ్చి పాలక వర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం ఇంటి పన్నులు రివైజ్ చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వర రావు, దారెల్లి పవిత్ర కుమారి, తడకమళ్ళ నాగేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు అప్పం సురేష్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు మద్దెల రవి, మాదినేని ప్రసాద్ , సీపీఎం పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా మణి, చింత నిప్పు చలపతిరావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed