ఆగని 'సుడా చైర్మన్' వసూళ్ల పర్వం.. రియల్టర్లకు తప్పని వేధింపులు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-09 04:42:51.0  )
ఆగని సుడా చైర్మన్ వసూళ్ల పర్వం..  రియల్టర్లకు తప్పని వేధింపులు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: 'సుడా కలెక్షన్ కింగ్' వసూళ్ల పర్వం ఇంకా ఆగడం లేదు.. రియల్లర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం.. లేకుంటే ఫైళ్లు పక్కకు పెట్టడం పరిపాటిగా మారింది. ఇదే విషయమైన 'దిశ' ఎన్నో సంచలనాత్మక కథనాలు కూడా ప్రచురించింది. అప్పుడు అలాంటిదేం లేదంటూ చెప్పుకొచ్చిన సుడా చైర్మన్, మళ్లీ తన వసూళ్ల దందాను షురూ చేశారు. ఈసారి కొంత డబ్బు ముట్టజెప్పినా మిగతావి కూడా వెంటనే ఇవ్వాల్సిందేనంటూ అధికారులను వెంచర్ల మీదికి ఉసిగొల్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ వెంచర్ వేసినందుకుగాను రూ. ౨౪ లక్షలు డిమాండ్ చేశాడని, ఆయనతో పాటు అధికారులు కూడా డిమాండ్ చేస్తే కొంత ఇచ్చానని.. మిగతావి కూడా ఇవ్వాల్సిందేనని పనులు ఆపిస్తున్నాడంటూ ఓ రియల్టర్ 'దిశ ప్రతినిధి'కి తన గోడు వెల్లబోసుకోవడం గమనార్హం.


రూ.11లక్షలు ఇచ్చినా పనుల అడ్డగింత

ఖమ్మం రూరల్ మండలంలో ఓ రియల్టర్ ౫ ఎకరాల్లో వెంచర్ వేశాడు. దీనికి సంబంధించి అన్ని రకాల పర్మిషన్ల కోసం సుడా చైర్మన్ బచ్చు విజయ్ రూ. 24 లక్షలు కమిట్మెంట్ కుదుర్చుకున్నాడని సమాచారం. దాంట్లో మొదటి విడతగా రూ. 11లక్షలు సైతం బచ్చుకు ఇచ్చినట్లు, మిగతా డబ్బుల కోసం అధికారులను పంపించి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు సైతం లక్షల్లో డిమాండ్ చేశారని, వారికి సైతం కొంత డబ్బు ముట్టచెప్పినట్లు బాధితుడు చెప్పడం గమనార్హం. మిగతా డబ్బులు ఇచ్చేందుకు కొంత టైం అడిగినా ఇవ్వకుండా.. పనులు చేయనీయకుండా ఏదో ఒకటి చెబుతూ అడ్డుతగులుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

పనుల అడ్డగింత..

బాధిత రియల్టర్ కు సంబంధించి వెంచర్ లో పనులు చేస్తుంటే.. స్థానిక అధికారులు వెళ్లి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు వారితో వాగ్వాదానికి దిగినట్లుగా కూడా సమాచారం. అదే సమయంలో బాధితుడు సుడా చైర్మన్ కు ఫోన్ చేసి 'డబ్బులు ఇచ్చినా పనులు ఆపేస్తున్నారని.. తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు.. దీంతో బచ్చు తర్వాత మాట్లాడుతానంటూ..'ఫోన్ కట్ చేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం ఆ వివాదంలో కోర్టు కేసు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమ దగ్గర నుంచి లక్షలకు లక్షలు డిమాండ్ చేస్తున్నారని.. కొంత డబ్బులు ఇచ్చినా మిగతా వాటికోసం వేధింపులు ఆగడం లేదంటూ రియల్టర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే మేం వ్యాపారం బంద్ చేసుకోవడమే ఉత్తమమంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

వెంచర్లోకి వెళ్లకుండా..

కాగా సుడా నుంచి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటీన సంబంధిత వెంచర్లోకి వెళ్లి పనులను అడ్డుకున్నారు. అంతేకాక వెంచర్ లోపలికి ఎవరూ వెళ్లకుండా ఎంట్రన్స్ లో రహదారులను డోజర్తో తవ్వించారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున ఈ వెంచర్ ను అడ్డుకున్నామని తెలిపిన అధికార గణం.. ఎలాంటి అనుమతులు లేవని పేర్కొనడం విశేషం.. ఎలాంటి అనుమతులు లేనప్పుడు డబ్బులు తీసుకోవడం ఎందుకు? అనుమతులు ఇస్తామని మభ్యపెట్టి నిర్వాహకులను ఇబ్బందులు పెట్టడం దేనికనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అయితే ఈ విషయం చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన బచ్చు నిర్వాహకుని సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడిని రంగంలోకి దింపి మంతనాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అధికారులూ తెగబడ్డారు..

వెంచర్ల అనుమతుల్లో జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. కేవలం సుడా చైర్మన్ కే అనుకుంటే పొరపాటే.. అతనితో పాటు అధికారులు సైతం మీమేమీ తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. పైగా అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ తమను ఏమీ చేయలేరని వారే బాహాటంగా పేర్కొనడం విస్మయం గొలుపుతున్నది. అయితే ఖమ్మం రూరల్ మండలంలో వేసిన ఈ వెంచర్లో ప్రధాన పాత్ర సుడా చైర్మన్ పోషిస్తే.. ఎంపీఓ సైతం లక్షల్లో వసూలు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఎంపీఓకు రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు ఆవేదన వెలిబుచ్చాడు.

ఇంతా చేసినా..

అయితే అనుమతుల కోసం అడిగినవారికి అడిగినంత ఇచ్చినా తనను సుడా చైర్మన్, అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారని, అందరూ కలిసి ఎకరాల వారీగా డబ్బులు అడుగుతున్నారని ఇలా ఐతే వ్యాపారం ఎలా చేసుకోవాలో చెప్పాలని ఆవేదన చెందుతున్నాడు. ఈ సమస్య కేవలం తన ఒక్కడిదే కాదని, వెంచర్లు వేసే రియల్టర్లు, బిల్డర్లు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఖమ్మం పరిధిలో ఉన్న అన్ని వెంచర్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనేక విషయాలు బయట పడతాయని దిశ ప్రతినిధికి తెలిపారు. వ్యాపారం చేసే వారందరూ లోలోపల కుమిలిపోతున్నా.. ఏదో ఒక రోజు అన్ని బయటకు వస్తాయని తెలిపారు.

ఫోన్ చేస్తే..

బాధితుడు వెలుగులోకి తెచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకుని దీనిపై వివరణ అడిగేందుకు దిశ ప్రతినిధి సుడా చైర్మన్ బచ్చు విజయ్ ని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఉదయం ఆఫీసులో కలుద్దామన్నారు. మధ్యాహ్నం వరకు అందుబాటులోకి రాకపోవడంతో మరోసారి ప్రయత్నించగా గంటలో ఫోన్ చేసి వివరిస్తానన్నాడు. గంట తర్వాత ఫోన్ చేయగా.. సాయంత్రం 6.30 గంటలకు ఆఫీసులో కలుద్దామని చెప్పాడు. అయినా సార్ దొరక్కపోవడంతో మరోసారి ఫోన్ చేయగా తానే ఫోన్ చేస్తానని చెప్పి తప్పించుకున్నాడు. ఇలా ఎన్ని సార్లు సంప్రదించే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాకపోవడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed