రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు : మంత్రి తుమ్మల

by Aamani |
రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు : మంత్రి తుమ్మల
X

దిశ, ఖమ్మం : రైతు పొలాలకు సాగునీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం మంత్రి, అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ తో కలిసి రఘునాథపాలెం మండలం లో పర్యటించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో శివాయి గూడెం గ్రామం నందు 21 లక్షల 50 వేలతో చేపట్టిన (5) అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, పువ్వాడ నగర్ గ్రామం నందు 78 లక్షలతో చేపట్టిన 11 అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, మంచుకొండ గ్రామంలో ఒక కోటి 34 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... మంచుకొండ గ్రామం తో అనేక సంవత్సరాలుగా తనకు పరిచయం ఉందని, ఇక్కడ మంచి నీళ్లు, పాఠశాలలో నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో భాగం పంచుకునే అవకాశం తనకు లభించిందని అన్నారు. రైతాంగం, పేద ప్రజల కోసం భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి మేరకు కృషి చేస్తున్నానని, ఖమ్మం జిల్లాలో ముందు సాగునీరు, తరువాత రహదారులు, విద్య, వైద్యం అభివృద్ధికి బాధ్యత తీసుకొని, మన ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.

భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఖమ్మం జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చెరువుల పునరుద్ధరణ, ఎత్తిపోతల పథకం, కాలువల నిర్మాణం చేశామని, చివరకు గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు తీసుకుని వస్తే తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ప్రజల రుణం తీర్చుకున్నట్లు అవుతుందని అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ను ఒప్పించి పెండింగ్ పంపు పనులు పూర్తి చేసి ఎత్తిపోతలను ప్రారంభించామని, కాలువలు నిర్మించాల్సి అవసరం ఉందని అన్నారు. రఘునాథపాలెం మండలానికి సాగునీరు అందించేందుకు బుగ్గ కాలువ పనులు మంజూరు చేసినప్పటికీ ఆ పనులను కాంట్రాక్టర్లు చేయలేకపోయారని మంత్రి తుమ్మల తెలిపారు.

రఘునాథ పాలెం మండలంలో ఉన్న చెరువులు త్వరగా నింపేందుకు సాగర్ నీళ్లను అత్యవసరంగా తీసుకొని రావాలని 66 కోట్లతో మంచుకొండ ఎత్తిపోతల పథకం శ్రీకారం చుట్టామని, దీని వల్ల 36 చెరువులు నింపేటట్లు రూపకల్పన చేయడం జరిగిందని, ప్రజలు సహకరిస్తే సంక్రాంతి నాటికి పనులకు శంకుస్థాపన చేస్తామని, వేసవి పూర్తయ్యే లోపు ప్రాజెక్టు పూర్తి చేసి చెరువు నింపే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి తెలిపారు. 500 కోట్లతో రఘునాధపాలెం మండల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మండలంలోని అంగన్వాడీ భవనాలు నిర్మాణం, పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన, ప్రతి ఇంటికి మంచినీరు, సాగు నీటి వసతి కల్పిస్తున్నామని అన్నారు.

మండలంలో రైతులతో చర్చించి పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని, ఆయిల్ పామ్ పంటకు కోతులు, అకాల వర్షాల వంటి అనేక సమస్యలు ఉండవని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కంటే అధికంగా రైతులకు ఆదాయం వస్తుందని అన్నారు. రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని, అర్హులు ఎవరికైనా పథకాలు అమలు కాకపోతే మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని, డైట్ చార్జీలు, మెస్ చార్జీలు గణనీయంగా పెంచామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యత అందిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఎటువంటి అవకతవకలు పాల్పడవద్దని మంత్రి సూచించారు.

అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ... మంచుకొండ గ్రామంలో కోటి 30 లక్షల విలువ గల సీసీ రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిని నాణ్యతతో పూర్తి చేసుకోవాలని అన్నారు. ఇతర జిల్లాల తో పోల్చితే మన దగ్గర మెరుగైన రోడ్లు ఉన్నాయని తెలిపారు. గ్రామాలలో ఏర్పాటు చేసే వీధి దీపాలను గ్రామ పంచాయతీ నిధులతో నిర్వహించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో అనవసరంగా పెద్ద వీధి దీపాలు పెడితే పంచాయతీ నిధులు వృధా అవుతాయని అన్నారు. గ్రామాలకు ప్రాధాన్యతగా అవసరమైన అంశాలను గ్రామ సభ నిర్వహించి పారదర్శకంగా నిర్ణయించాలని తెలిపారు. పన్నుల నుంచి అవసరం ఉన్న పనులను ముందు వరుసలో చేపట్టాలని, గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఇ హేమలత, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story