- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాడువ భూమిలో బడా వెంచర్.. నేషనల్ హైవే పేరు చెప్పి ఎంత మోసం చేస్తున్నారో తెలుసా?
దిశ ప్రతినిధి, ఖమ్మం: అది ఏమాత్రం నిర్మాణాలకు అనువైన స్థలం కాదు.. ఆమోద యోగ్యమైనది అంతకన్నా కాదు.. అదంతా పనికి రాని స్థలం.. సారంలేని బాడువ భూమి.. అందులో నిర్మాణాలు చేపట్టారో అంతే సంగతులు.. కొన్నేళ్ల తర్వాత నిర్మాణదారులు తలలు పట్టుకోవాల్సిందే.. ఇలాంటి స్థలంలోనే శ్రీనిధి ఎన్ క్లేవ్స్ వారి జయభేరి గ్రీన్ సిటీ వెంచర్ ఏర్పాటు కాబోతుంది.. కూసుమంచి మండల కేంద్రంలో 100 ఎకరాల్లో నిర్మిస్తున్న భారీ వెంచర్ అంటూ నిర్వహకులు ఊదరగొడుతున్నా.. ఈ ప్లాట్లలో అడుగడుగునా అక్రమాలే కనపడుతున్నాయి.. ఓ వైపు కస్టమర్లకు బాడువ భూమి అట్టగట్టేందుకు ప్రయత్నిస్తూనే మరో పక్క ఎలాంటి అనుమతులే లేకుండా నిర్మించి ప్రభుత్వ ధనానికి పంగనామాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.. రైతుల వద్దనుంచి భూమి తీసుకున్నట్లు ఒప్పందం తీసుకుని పనులు చేయించడం మినహా వారు ఇంత వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది.. చివరికి కన్వర్షన్ కూడా లేదని స్వయంగా అధికారులే చెబుతున్నారు. 'శ్రీనిధి ఎన్ క్లేవ్స్ వారి జయభేరి గ్రీన్ సిటీ'మోసంపై దిశ అందిస్తున్న కథనం..
వాస్తవానికి జయభేరి వెంచర్ వేసే స్థలం పూర్తిగా బాడువ భూమి అనే ప్రచారంలో ఉంది. ఆ భూమి గట్టిదనం కోల్పోయి.. చాలా నాసిరకంగా ఉంటుంది.. భూమిలో సారం ఏమాత్రం ఉండదు.. చెరువుకు సంబంధించి నిరంతరం కాలువ పారే భూమి అది. ఎప్పటికీ ఆ భూమి తడిగానే ఉంటుందని. ఎట్టిపరిస్థితుల్లో ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదని స్వయంగా గ్రామస్తులే చెబుతుండటం గమనార్హం. భూమి పరీక్షలననుసరించి చూస్తే ఏమాత్రం భూసారం లేని.. ఎలాంటి కట్టడాలకు ఆమోదయోగ్యం కాని భూమని చుట్టుపక్కల వ్యవసాయదారులు, స్థానిక పెద్దలు, గ్రామస్తులు చెబుతున్న మాట. అలాంటి భూమినే జయభేరీ వెంచర్ పేరుతో అమాయక జనాలకు అంట గట్టేందుకు ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు.
పోత మట్టిపోస్తూ..
వెంచర్ స్థలం పూర్తిగా డౌన్ లో ఉంటుంది.. ఈ క్రమంలో కస్టమర్ల దృష్టి ఆ కోణంలో ఆలోచించకుండా ఉండేందుకు నిర్వాహకులు భారీగా పోతమట్టి పోసి పైకి లేపుతున్నారు. ట్రాక్టర్లతో మట్టి తీసుకువచ్చి దాన్ని డౌన్ ఉన్న స్థలంలో పోయించి చదును చేయిస్తున్నారు. దీంతో కొంత కాలం తర్వాత అది సహజమైన మట్టిగానే కస్టమర్లు అనుకునే ప్రమాదం ఉంది. అయితే పోతమట్టితో ఎంత హైట్ లేపినా.. అక్కడ ఏదైనా నిర్మాణం చేపడితే భవిష్యత్ లో కుంగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. అసలే సారం లేని భూమి దీనిపై ఇంకా పోతమట్టి పోసి ప్లాట్లు విక్రయించి కొనుగోలుదారులను మోసం చేయడం దారుణమంటున్నారు. ఈ వెంచర్ ముందునుంచి పోయే నేషనల్ హైవే ను చూపించి కొనుగోలు దారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
అనుమతులెక్కడ..?
కూసుమంచిలో జయభేరీ గ్రీన్ సిటీ వెంచర్ ఏర్పాటుకు సంబంధించి కేవలం రైతుల వద్ద నుంచి భూములు కొనుగోలుకు సంబంధించి నామమాత్రం అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నట్లు తెలుస్తున్నది. మూడొంతుల్లో ఒకవంతు మాత్రమే వారికి చెల్లించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈవిధంగా 65ఎకరాల మేర రైతుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. మరో 35ఎకరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండానే బోర్డులు పెట్టి పనులు చేయించడంపై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇంత వరకు కన్వర్షన్ కు కూడా వెళ్లనట్లు తెలుస్తోంది. ఏవీ లేకున్నా.. రెరా, డీటీసీపీ అప్రూవుడ్ లేఅవుట్ అంటూ బ్రోచర్లు మాత్రం ప్రచురించి కస్టమర్లను బురిడీ కొట్టించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడం, దిశలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు సైతం వెంచర్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డులు సైతం తొలగించి స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంచారు.
అసైన్డ్ ల్యాండ్ ఆక్రమించి..?
జయభేరీ వెంచర్ నిర్వహకులు తీసుకున్న పొలాలను సాకుగా చూపి పక్కనున్న అసైన్డ్ ల్యాండ్ సైతం కొంత ఆక్రమించినట్లు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తర్వలోనే అధికారులు సర్వే నిర్వహించి తేల్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కొంత వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినా.. ఎంత ఆక్రమణకు గురైందో సర్వే చేస్తేగానీ బయటపడుతుంది. ఇక వెంచర్ అనుమతులు, ఎలాంటి పర్మిషన్లు లేకుండానే పనులు చేయించం, అడ్వాన్సు బుకింగుల పేరిట డబ్బుల వసూలు వీటన్నింటిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తున్నది. అన్ని అనుమతులు ఉన్నాయంటూ రంగురంగుల బ్రోచర్లు ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. పండుగ ఆఫర్లు.. ఫ్రీ బుకింగ్ ఆఫర్లంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రంగం సిద్ధంచేసుకున్నట్లు తెలుస్తున్నది. అడుగడుగునా అక్రమాలతో వెలుసున్న శ్రీనిధి ఎన్ క్లేవ్స్ వారి జయభేరి గ్రీన్ సిటీ వెంచర్ పై ఉన్నతాధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.
'దిశ' కథనంలో వెలుగులోకి..
మేం 'ఉన్న'మంటూ జయభేరి మాయ అంటూ దిశలో రెండు నాలుగు రోజుల క్రితం వార్త ప్రచురితం కావడంతో ఈ వెంచర్ వ్యవహారాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. కథనం ప్రచురితమైన రోజే కొందరు బాధితులు దిశ ప్రతినిధికి ఫోన్ చేసి సమాచారం అందించారు. తిరుమలాయపాలెం, రఘునాథపాలెం మండలాల్లో శ్రీనిధి వెంచర్లలో అనేక అక్రమాలు జరిగాయని తెలిపారు. ఒక చోట ప్రభుత్వ భూమి, మరోచోట ఎన్నెస్పీ భూమిని ఎకరాల కొద్ది ఆక్రమించారని తెలియజేశారు. పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ, ఎన్నెస్పీ భూముల వివరాలు రెవెన్యూ సిబ్బంది ఒకరు నిర్వాహకులకు అందజేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి అందిన సమాచారం మేరకు ఆ వెంచర్ల జరిగిన అక్రమాలను కథనాలుగా ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.