షాడో పాలిటిక్స్

by Sridhar Babu |
షాడో పాలిటిక్స్
X

దిశ, అశ్వారావుపేట టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎమ్మెల్యే పీఏ తానే ఎమ్మెల్యేగా బిల్డప్ ఇస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఎమ్మెల్యేకు వ్యక్తిగత సహాయకుడే అయినా సర్వం తానై శాసిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ రాజకీయాలపై మక్కువ పెంచుకోవడమే కాకుండా అటు ఎమ్మెల్యేకు.. ఇటు పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారుతున్నాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ పరిణామం ఇటు ఆ పార్టీ క్యాడర్ కే కాకుండా అధికారులకు సైతం ఇబ్బందిగా పరిణమిస్తోందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నారు.

ఎమ్మెల్యే దృష్టిసారించి విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇటీవల వరద పరిహారం చెల్లింపులో తన చేతివాటం చూపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. ఇతని వ్యవహార శైలిపై అటు అధికారులు, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. అసలు విధులు పక్కనబెట్టి రాజకీయాల్లో తలదూర్చటం మొదలు పెట్టాడని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు.

షాడో ఎమ్మెల్యే....

వ్యక్తిగత సహాయకునిగా బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా అధికార దర్పం ప్రదర్శిస్తున్నాడు. ఎమ్మెల్యే సమావేశాలకు హాజరు కావాలంటూ ఉన్నత స్థాయి అధికారులకు హుకుం జారీ చేస్తూ వారిపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడు. తానే ఎమ్మెల్యే అన్నట్లు ఆయన ప్రవర్తన శైలి ఉంటడంతో అధికారులు సైతం ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రభుత్వాధికారులను చులకనగా చూస్తూ తన కింది సబార్డినేట్ లాగా భావిస్తూ తమకు ఆర్డర్లు జారీ చేస్తున్నాడని అధికారులే అంటున్నారు. తోటి సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని, అతని వ్యవహారశైలిని భరించలేకున్నామని వాపోతున్నారు.

పార్టీ క్యాడర్లోనూ అసంతృప్తి..

ఈ పీఏ వ్యవహారంపై సొంత పార్టీ క్యాడరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మండల నాయకత్వాన్ని కాదని ఆయనే నేరుగా గ్రామాల్లో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడని కొందరు నేతలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. తమను కాదని తమ మండలాల్లో సమయం దొరికినప్పుడల్లా తిరుగుతూ తమ గురించి ఎమ్మెల్యేకు చాడీలు చెబుతున్నాడని వాపోతున్నారు. కొంత సమయం ఇచ్చి చూడాలనే ఆలోచనతో ఉన్నామని, అతని వ్యవహారశైలి ఇలాగే ఉంటే అధినాయకత్వం వద్దే తేల్చుకుంటామని అంటున్నారు. తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా రాజకీయాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మండల నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. రాజకీయాలంటే ఇష్టం ఉంటే నేరుగా ప్రజల్లోకి వస్తే మంచిదని హితవు పలుకుతున్నారు.

పరిహారం చెల్లింపుల్లో కీలకం

ఈ ఏడాది జూలైలో కురిసిన అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. ఈ పరిహారం చెల్లింపులో నిధులు దుర్వినియోగం అయ్యాయనే అనుమానం అక్కడి రైతులు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో సుమారు 15 మంది అనర్హులకు పరిహారం సొమ్ము అందించి బంధుప్రీతి చాటుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారం బహిర్గతం కావటంతో తనపైనే ఆరోపణలు చేస్తారా అంటూ రగిలిపోతున్నాడు. ఇక ఇసుక అక్రమ రవాణాలో ఈయన పాత్ర ప్రధానంగా వినిపిస్తుంది. తన బంధువులు, అనుచరులే తప్ప ఇంకెవరూ ఇసుక రవాణాను చేస్తే సహించటం లేదని, అధికారులతో దాడులు చేయించటం లేదా.. అడ్డుకునేలా ఒత్తిడి చేయటం పరిపాటిగా మారిందనే వాదన లేకపోలేదు.

ఒక వర్గం మీడియా సహకారం

మీడియా ముసుగులో ఉన్న కొందరు రాజకీయ నాయకుల సహకారం కూడా తీసుకుంటున్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు, పార్టీకి, మండల నాయకత్వానికి వ్యతిరేకంగా ఉండే అందరినీ పీఏ అక్కున చేర్చుకుని వారి అక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. పీఏ సహకారంతోనే రాజకీయ మీడియా ప్రతినిధులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అన్ని పార్టీల్లో కాలం వెళ్లదీసిన కొందరు.. మీడియా ముసుగులో గాంభీర్యం ప్రదర్శిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని, వారికి పీఏ అండ తోడవడంతో రెచ్చిపోతున్నారని టాక్.

ఎమ్మెల్యేగారు..దృష్టి పెట్టండి..

పీఏ వ్యవహారం చినికిచినికి గాలివాన కాకముందే ఎమ్మెల్యే ఇతనిపై దృష్టి సారించాలని నియోజకవర్గ నాయకులతోపాటు.. మండల నాయకులు కోరుకుంటున్నారు. పీఏ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని, అయినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లలేదని, కొంత సమయం ఇద్దామనే ఆలోచనతోనే చెప్పలేదంటున్నారు. కానీ రోజురోజుకు ఇతని ఆగడాలు పెరుగుతున్నాయని, త్వరలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని నాయకులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed