Hyderabad Metro: రెండో దశ మెట్రో.. ఈ విషయాలు తెలుసా ?

by Rani Yarlagadda |
Hyderabad Metro: రెండో దశ మెట్రో.. ఈ విషయాలు తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తోంది మెట్రో (Hyderbad Metro). ప్రతిరోజూ 5 లక్షల మందిని.. నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేర్చుతూ.. ప్రజల ప్రధాన రవాణా మార్గంగా నిలిచింది. రద్దీ వేళల్లో ప్రతి 2-3 నిమిషాలకొక మెట్రో ట్రైన్, రద్దీ తక్కువగా ఉన్నప్పుడు 7-10 నిమిషాల వ్యవధిలో మెట్రోలను నడుపుతూ.. ప్రజల అవసరాలను తీరుస్తోంది. కాలం ఏదైనా సరే.. సురక్షితంగా ప్రయాణం చేయగలిగేది మెట్రోలోనే అనేలా సేవలందిస్తోంది హైదరాబాద్ మెట్రో. ప్రస్తుతం మూడు కారిడార్లలోనే ఉన్న మెట్రో.. 69 కిలోమీటర్ల వరకూ సేవలందిస్తోంది. రూ.22,000 కోట్లతో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిర్మించారు. రెండో దశలో హైదరాబాద్ మెట్రో 5 కారిడార్లకు విస్తరించనుంది.

నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) సమావేశంలో రెండోదశ మెట్రో (Second Phase Metro)కి మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి విధితమే. నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే రెండోదశ మెట్రో నిర్మాణ పనులు జరగాల్సింది. కానీ.. ఏడేళ్లు ఆలస్యం చేయడంతో ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు పెరిగిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా వంటి నగరాలతో పాటు పూణె, నాగపూర్, అహ్మదాబాద్ వంటి చిన్న నగరాలు కూడా మెట్రో విస్తరణలో హైదరాబాద్ ను అధిగమించాయని తెలిపింది. రెండోదశలో హైదరాబాద్ మెట్రో ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ (Detailed Project Report) పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పీపీపీ (PPP) విధానంలో సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మాణాన్ని చేపట్టనున్నాయి. మొత్తం అంచనా రూ.24,269 కోట్లు కాగా.. అందులో 30 శాతం.. అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం - రూ.4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మిగతా 52 శాతం నిధులను రుణాలు, పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలి. రెండోదశ మెట్రో పూర్తయితే.. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగులు, విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాల నుంచి బిగ్ రిలీఫ్ దక్కుతుంది.

రెండో దశ మెట్రోలో కారిడార్లు ఇవే..

4వ కారిడార్ - నాగోల్ టు శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8km)

5వ కారిడార్ - రాయ్ దుర్గ్ టు కోకాపేట్ నియోపొలిస్ (11.6km)

6వ కారిడార్ - ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట (7.5km)

7వ కారిడార్ - మియాపూర్ టు పటాన్ చెరు (13.4km)

8వ కారిడార్ - ఎల్బీనగర్ టు హయత్ నగర్ (7.1km)

Advertisement

Next Story