- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరువుకు పరువు.. గౌరవానికి గౌరవం
దిశ, వైరా : "ఏది జరిగినా మన మంచికే" అనే సామెతను మన పెద్దలు నిరంతరం గుర్తు చేస్తుంటారు. ఇదే సామెత వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కు వర్తించింది. ఈ ఎన్నికల్లో వైరా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలం చెందిన రాములు నాయక్ కు టికెట్ రాకపోవడమే మంచిదయిందని ప్రస్తుతం ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ రాములు నాయక్ కు టికెట్ కేటాయించినా కాంగ్రెస్ గాలిలో ఓటమి చెంది పరువు, గౌరవం పోవటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యేవారని చర్చ రాజకీయంగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించకపోయినప్పటికీ పార్టీ విధేయుడుగా ఉంటానని ప్రకటించి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ కు సహకరించి నియోజకవర్గ ప్రజల ప్రశంసలు పొందారు. "ఒక చెడు మరో మంచికి నాంది పలుకుతుందని" రాములు నాయక్ టికెట్ కేటాయించకపోవడం అనంతరం జరిగిన రాజకీయ పరిస్థితులు చూస్తే అర్థమవుతుందని స్థానికంగా చర్చ నడుస్తుంది.
స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములు నాయక్..
2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైరా నియోజకవర్గ నుంచి లావుడ్యా రాములు నాయక్ వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పై 2013 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైరా టికెట్ ను సీపీఐకు కేటాయించింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున బానోత్ మదన్ లాల్ ఎన్నికల బరిలో దిగారు. అయితే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నియోజకవర్గంలోని పొంగులేటి వర్గీయులు మదన్ లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో పొంగులేటి వర్గీయులతో పాటు నియోజకవర్గంలోని మదన్ లాల్ వ్యతిరేక వర్గీయులు, కాంగ్రెస్ పార్టీలను కొంతమంది సహాయ సహకారాలతో రాముల నాయక్ వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. రాములు నాయక్ 2018 నుంచి 2023 సంవత్సరం వరకు వైరా ఎమ్మెల్యేగా పనిచేసి అజాతశత్రువుగా పేరు ప్రఖ్యాతను సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయాల్లో చురుకైన నిర్ణయం తీసుకోవడంలో ఆయన విఫలం చెందారు. అయితే నియోజకవర్గంలో ఆయన ఎలాంటి రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు వెళ్లలేదు.
ఒకే ఒక్కడికి టికెట్ నిరాకరణ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్ వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఒక్కడికి మాత్రమే టికెట్ ను నిరాకరించారు. ఉమ్మడి జిల్లాలో రాములు నాయక్ కంటే అప్పటి మరోముగ్గురు ఎమ్మెల్యేల పై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అప్పటి కొత్తగూడెం ఎమ్మెల్యే, ఇల్లందు ఎమ్మెల్యే, పినపాక ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అప్పట్లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయినప్పటికీ వారందరికీ టికెట్లు ఇచ్చిన కేసీఆర్ రాములు నాయక్ కు మాత్రం టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కు వైరా టికెట్ ను కేటాయించారు. రాములు నాయక్ కు టికెట్ కేటాయించకపోవడం వెనుక అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హస్తముందని రాములు నాయక్ వర్గీయులే బహిరంగంగా విమర్శించారు.
అంతా మంచే జరిగిందట..
రాములు నాయక్ కు టికెట్ కేటాయించక పోవటం, ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారటాన్ని పరిశీలించిన నియోజకవర్గ ప్రజలు అంతా మంచే జరిగిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రాములు నాయక్ టికెట్ కేటాయించకపోయినప్పటికీ పార్టీ విధేయుడిగా పనిచేసి గౌరవానికి గౌరవం, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా ఉండి పరువుకు పరువు కాపాడుకున్నారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే రాములు నాయక్ టికెట్ వచ్చినా కాంగ్రెస్ గాలిలో ఓటమి చవి చూసేవారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాములు నాయక్ టికెట్ వస్తే పోల్ మేనేజ్మెంట్ కు అత్యధికంగా ఖర్చుచేసి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉండేవారనే చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పార్టీ విధేయుడుగా ఉండి రాములునాయక్ ప్రజల ప్రశంసలు పొందారు. ఏది ఏమైనా ఒక చెడు మరో మంచికి నాంది అనే విషయం రాములు నాయక్ రాజకీయ పరిణామాల్లో రుజువైందని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ఏడుపదుల వయసు దాటిన రాములు నాయక్ ప్రశాంత జీవితాన్ని గడపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.