నూతన కాలనీలు, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం

by Sridhar Babu |
నూతన కాలనీలు, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం
X

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలు, విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం 16వ డివిజన్ శ్రీరామ్ నగర్ రోడ్డు నంబర్ 13లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.కోటి 95 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలు, విలీన ప్రాంత గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఖాళీ స్థలాల్లో నీరు నిలవడంతో కాలనీవాసులు దోమలు, చెత్తతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా యజమానులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని, సంబంధిత భూ యజమానులు స్పందించని పక్షంలో నోటీసులు జారీ చేయాలని మంత్రి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

మనల్ని నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేసే దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పని చేయాల్సి ఉంటుందని, వరదల కారణంగా ముంపునకు గురైన ఇళ్లకు ఇప్పటి వరకు కొంత మందికి పరిహారం అందలేదని దరఖాస్తులు వచ్చాయని, నిజంగా పేదలు ఉండి ముంపునకు గురై ఉంటే సర్వే నిర్వహించి పరిహారం అందజేస్తామని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎగ్గొట్టిన రైతు బంధు సొమ్మును తాము చెల్లించామని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని విస్మరించి నేడు మొసలి కన్నీరు కారుస్తూ ధర్నా చేయడం హాస్యాస్పదమని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. దీపావళి నుంచి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పక్కాగా నిర్మించాలని కోరారు. కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఆదివారం శంకుస్థాపన చేసిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను రెండు కోట్ల నిధులతో చేపడుతున్నామని, దీనికి వర్క్ ఆర్డర్ అందించామని, రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అన్నారు. 16వ డివిజన్ లో దాదాపు 1500 కుటుంబాలకు వరద పరిహారం అందించామని, పెండింగ్ లో ఉన్న మిగిలిన కుటుంబాలకు వారం రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఆర్డీఓ జి. గణేష్, 16వ డివిజన్ కార్పొరేటర్ మేడారపు వేంకటేశ్వర్లు, నగర పాలక సంస్థ కార్పొరేటర్ లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed