దద్దరిల్లిన వైరా పట్టణం.. హాట్ టాపిక్‌గా మారిన పొంగులేటి బైక్ ర్యాలీ

by Mahesh |   ( Updated:2023-02-13 10:12:37.0  )
దద్దరిల్లిన వైరా పట్టణం.. హాట్ టాపిక్‌గా మారిన పొంగులేటి బైక్ ర్యాలీ
X

దిశ, వైరా: అనుకున్నదొక్కటి... అయ్యింది ఒక్కటి.... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్న చందంగా వైరాలోని రాజకీయ పార్టీల పరిస్థితి మారింది. పొంగులేటి వర్గీయులు సోమవారం నిర్వహించిన బైక్ ర్యాలీతో ప్రధాన రాజకీయ పార్టీలో కలవరం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీను పొంగులేటి తీవ్రంగా వ్యతిరేకించటంతో ఆయన వెంట వెళ్లిన సుమారు 20 మందిని ఆ పార్టీ బహిష్కరించింది.

అయితే వైరా మండలంలో మార్కెఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మిట్టపల్లి నాగేశ్వరరావు, అష్ణగుర్తి సర్పంచ్ ఇటుకల మురళి, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య మాత్రమే పొంగులేటి వర్గంలోకి వెళ్లారు.

అయితే పొంగులేటి వెంట వెళ్లిన ఆ ఐదుగురు నేతలు వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని బీఆర్ఎస్ భావించింది. ఈ క్రమంలోనే గతంలో పొంగులేటి అనుచరులుగా ఉండి ప్రస్తుతం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఫాలోవర్స్‌గా కొనసాగుతున్న వారు తిరిగి పొంగులేటి వైపు వెళ్లేందుకు అంతగా ఆసక్తి కూడా చూపలేదు. అయితే ఈ నెల 15వ తేదీన వైరాలో పొంగులేటి వర్గీయుల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైరాలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీతో బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. వైరా మండలంలో సుమారు 600 ద్విచక్ర వాహనాలతో పాటు, కొణిజర్ల మండలానికి చెందిన సుమారు 200 ద్విచక్ర వాహనాలతో కలిపి 800 ద్విచక్ర వాహనాలతో వైరాలో భారీ స్థాయి ర్యాలీ నిర్వహించారు.

ఒక జెండా.. ఎజెండా లేకుండా నిర్వహించిన ఈ ర్యాలీకి వందలాది మంది స్వచ్ఛందంగా తరలి రావడం విశేషం. ఈ ర్యాలీకు వచ్చిన వారికి ఎలాంటి నగదు ఇవ్వకపోగా కనీసం ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ కూడా పొంగులేటి వర్గీయులు పోయించలేదు. స్వచ్ఛందంగా ఇంత మంది ర్యాలీకి రావటంతో బీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్షాల్లో అలజడి మొదలైంది. మొదట అయిదుగురే కదా.... వాళ్ళేం చేస్తారు.

అంటూ విమర్శించిన నోర్లే సోమవారం ఏది చేయాలన్నా వారికే సాధ్యమవుతుందని ప్రశంసించడం విశేషం. ప్రస్తుతం వైరా లో ఈ బైక్ ర్యాలీ అంశమే హాట్ టాపిక్ గా మారింది. గతంలో పొంగులేటి వర్గంలో ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యే వెంట కొనసాగుతున్న వారు ఈ భారీ బైక్ ర్యాలీతో పూర్తిస్థాయి అంతర్మధనంలో పడ్డారు. వైరాలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు తెలియకుండానే ఆయా వార్డుల్లో వందలాది మందిని పొంగులేటి వర్గీయులు బైక్ ర్యాలీలో పాల్గొనేలా చేశారు.

వైరాలోని సుమారు 7 వార్డులకు చెందిన అత్యధిక మంది బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం పొంగులేటి వర్గీయులు తమ బలాన్ని నిరూపించుకోవడంతో బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్షాల నాయకులు సీన్ రివర్స్ అయ్యిందా అని చర్చించుకుంటున్నారు. బైక్ ర్యాలీ విజయవంతం కావడంతో ఈ నెల 15వ తేదీన జరిగే ఆత్మీయ సమ్మేళనం పై అంచనాలు భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైరా రాజకీయాల్లో పొంగులేటి వర్గీయులు సంచలనాలకు కేంద్ర బిందువులు అవుతున్నారంటంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ర్యాలీతో పొంగులేటి వర్గీయుల భవిష్యత్తు రాజకీయాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదింపినట్లు అయింది. ఈ ర్యాలీలో పొంగులేటి వైరా నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ విజయభాయి, మార్కెఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మిట్టపల్లి నాగేశ్వరరావు, గుమ్మా రోశయ్యతో పాటు అనేక మంది నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed