నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు

by Sridhar Babu |
నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు
X

దిశ, ఖమ్మం : ఖమ్మం నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంరతి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 57వ డివిజన్ రమణ గుట్టలో టీయూఎఫ్ఐడీసీ నిధులు 85 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అభివృద్ధి పనులకు, రోడ్డుకు భూమి ఇచ్చిన మదన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు నిర్మాణం బాగా ఉంటే భూముల ధరలు పెరుగుతాయని అన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పేదలకు సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, సంక్రాంతి నుంచి ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, హౌసింగ్ శాఖ మన జిల్లా మంత్రి దగ్గర ఉంది కాబట్టి ఖమ్మంలో అధికంగా కేటాయింపు ఇవ్వాలని, నగరంలో జనాభా పెరిగిందని పేదలు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడ అధికంగా మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.

రాబోయే 4 సంవత్సరాలలో పేదలకు గతంలో లాగా కాలనీలలో ఇండ్లు నిర్మించి అందించడం జరుగుతుందని అన్నారు. పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు, కమిషనర్ ని కలవాలని, అర్హులందరికీ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నగరానికి నీటి సరఫరా కోసం రూ. 220 కోట్లతో అమృత్ కింద పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఖమ్మం నగరంలో వరదల కారణంగా ముంపు రాకుండా ఉండేందుకు పనులు చేపట్టేందుకు 250 కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభించి రాబోయే వర్షాకాలంలో అటువంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మొన్న వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని నూతనంగా నిపుణుల కమిటీచే అంచనాలు తయారు చేస్తున్నామని అన్నారు. డంపింగ్ యార్డ్ రోడ్డు విస్తరణ కోసం రూ.కోటి 15 లక్షలు మంజూరు చేశామని అన్నారు. నగరంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి 8 కోట్లు మంజూరు చేశామని, 500 ఎకరాలలో ఉన్న వెలుగు మట్ల అర్బన్ పార్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ లాగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఖమ్మం ఖిల్లా వద్ద పదిహేను, ఇరవై కోట్లు ఖర్చు పెట్టి రోప్ వే ఏర్పాటు చేయడానికి, అక్కడ కొంత సమయం ఆహ్లాదంగా గడిపే పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

డివిజన్ ల వారీగా అవసరమైన చోట నూతన రోడ్లు, డ్రైయిన్లు మంజూరు చేస్తున్నామని, వీటిని నాణ్యతతో నిర్మించి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు పని చేయాలని అన్నారు. రహదారుల వెంట, ప్రభుత్వ భూములలో ఆక్రమణలు జరుగుతుంటే మొదటి స్థాయిలోనే అధికారులు అరికట్టాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. నగరంలో పారిశుద్ధ్య చర్యలు మరింత మెరుగ్గా అమలు కావాల్సిన అవసరం ఉందని, కార్పొరేటర్లు బాధ్యత తీసుకొని తమ డివిజన్ లు అందంగా తీర్చిదిద్దాలని, అవసరమైన చోట మొక్కలు ఏర్పాటు చేసి సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దాలని అన్నారు. 57వ డివిజన్ లో నూతనంగా అంగన్వాడీ కేంద్రం మంజూరు చేస్తామని, ఇక్కడ అవసరమైన విద్యుత్ స్తంభాలు, అవసరమైన ప్రజలకు విద్యుత్ మీటర్లు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయని, ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రారంభమయ్యాయని, నిన్న కల్లూరు లో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించామని అన్నారు. చక్కని ఎమ్మెల్యేను ఎన్నుకున్నారని, సమయాన్ని వృథా చేయకుండా నిరంతరం ప్రజల కోసం మంత్రి తుమ్మల పాటు పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, 57వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ రఫీద బేగం, కార్పొరేటర్ కమర్తపు మురళి, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story