పెండింగ్ ధాన్యం విలువ అక్షరాల రూ. కోటి.. గడువు ముగిసినా మిల్లర్‌పై నో యాక్షన్

by Aamani |
పెండింగ్ ధాన్యం విలువ అక్షరాల రూ. కోటి.. గడువు ముగిసినా మిల్లర్‌పై నో యాక్షన్
X

దిశ, వైరా : పైసా ఖర్చు లేదు. ప్రభుత్వం నుంచి తీసుకునే ధాన్యానికి గ్యారెంటీ అసలే లేదు. రైస్ మిల్లులో బియ్యం మర పట్టించే సామర్థ్యం కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వమే మిల్లర్ కు ధాన్యం సరఫరా చేసింది. ఇంకేముంది. సదరు మిల్లర్ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఎలాంటి షూరిటీ, గ్యారంటీ లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యమును ఎంచక్కా సదరు మిల్లర్ విక్రయించేశాడు. అయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ ఇవ్వాల్సిన ధాన్యం విలువ ఒక రూ.లక్ష కాదు రూ. రెండు లక్షల కాదు .... ఏకంగా కోటి రూపాయలు పైనే ఉంటుంది. అయినా అధికారులు ఇంకా ఉదాసీనంగా వ్యవహరించడం విశేషం. గత నెల 31వ తేదీన ప్రభుత్వం పొడిగించిన గడువు ముగిసిన సదరు మిల్లర్ నేటి వరకు ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయలేదు. ఇది వైరా నియోజకవర్గం కొనిజర్ల లో ఉన్న శ్రీ శ్రీనివాస రైస్ మిల్ యజమాని నిర్వాకం. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆ ధాన్యం విలువ రూ. కోటి పై మాటే...

కొణిజర్ల లోని శ్రీ శ్రీనివాస రైస్ మిల్లర్ ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ చేయాల్సిన ధాన్యం విలువ సుమారు కోటి రూపాయలు పైగానే ఉంటుంది. గత ఖరీఫ్ సీజన్లో ఈ మిల్లుకు ప్రభుత్వం 11600 క్వింటాళ్ల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు అప్పగించింది. అయితే 7250 క్వింటాళ్ల ధాన్యమును సదరు మిల్లర్ మరపట్టించి ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేశారు. అయితే మిగిలిన 4350 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన బియ్యంను గత రెండు నెలలుగా ఇవ్వకుండా సదరు మిల్లర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో ఈ మిల్లర్ కు ప్రభుత్వం 1062, 1001, 1010 తదితర రకాల ధాన్యమును సరఫరా చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ ధాన్యం సంబంధించి ఒక క్వింటా ధర రూ.2300 నుంచి రూ.2350 వరకు పలుకుతోంది.

ఈ లెక్కల ప్రకారం శ్రీ శ్రీనివాస రైస్ మిల్లర్ ప్రభుత్వంకు మర ఆడించి ఇవ్వాల్సిన 4350 క్వింటాళ్ల ధాన్యం విలువ ప్రస్తుత మార్కెట్లో కోటి రూపాయలు పైనే ఉంటుంది. అయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో సదరు మిల్లర్ ప్రభుత్వానికి బియ్యాన్ని సరఫరా చేయకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కోటి రూపాయల విలువైన ధాన్యంను గోల్మాల్ చేసిన మిల్లర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed