- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే అనుచరులే టార్గెట్..!
దిశ, వైరా : రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించటంతో వైరా నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్స్ ప్రారంభమయ్యాయి. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి ఒక్కరోజు గడవకముందే వైరా నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్స్ ప్రక్రియ ఊపందుకుంది. చివరి నిమిషం వరకు వైరా టికెట్ ఆశించి భంగపడిన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అనుచరులను టార్గెట్ చేస్తూ ఈ ఆపరేషన్ ఆకర్స్ కొనసాగుతుంది. ఎమ్మెల్యే అనుచరులను తమ వైపు మలుచుకునేందుకు కాంగ్రెస్లోని పొంగులేటి వర్గీయులతో పాటు బీఆర్ఎస్ టికెట్ లభించిన మదన్ లాల్ వర్గీయులు పడరాని పాట్లు పడుతున్నారు.
ఇప్పటికే మదన్ లాల్ అనుచరులు తమ నేతకు టికెట్ రావటంతో వైరాతో పాటు పలుమండలాల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరులకు స్వీట్ బాక్స్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా మదన్ లాల్ అనుచరులు రాములు నాయక్ అనుచరులకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. మదన్ లాల్ సైతం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులకు ఫోన్ చేసి అందరం కలిసి పని చేసి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను గెలిపిద్దామని వారి సహకారాన్ని అభ్యర్థిస్తున్నారు. వైరా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వెంట ఉండే ముఖ్య నేతలతో పాటు వైరా మున్సిపాలిటీలోని కౌన్సిలర్లకు మదన్ లాల్ అనుచరులు ఫోన్లు చేసి మదన్ లాల్ కు సహకరించాలని కోరుతున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని పొంగులేటి వర్గీయులు గతంలో మదన్ లాల్ కు వ్యతిరేకులుగా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే రాములు నాయక్ కు అనుచరులుగా కొనసాగుతున్న వారితో మంతనాలు సాగిస్తున్నారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాదరంగా పొంగులేటి వర్గీయులు ఆహ్వానిస్తున్నారు. గ్రామస్థాయిలోని వార్డు మెంబర్ నుంచి నియోజకవర్గంలోని ముఖ్యనేతల వరకు గతంలో మదన్ లాల్ కు వ్యతిరేకంగా ఉన్న నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు పొంగులేటి పొంగులేటి వర్గీయులు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరితే సముచిత స్థానంతో పాటు గౌరవాన్ని కల్పిస్తామని స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. అయితే ఒకవైపు మదన్ లాల్ అనుచరులు, మరోవైపు పొంగులేటి వర్గీయుల విజ్ఞప్తులను ఎమ్మెల్యే అనుచరులు తోసి పుచ్చలేక తమ నిర్ణయాన్ని చెప్పేందుకు కొంత సమయం కావాలని అడుగుతున్నారు.
ఎన్నికలకు ఇంకా మూడు నెలల కాలం ఉండటంతో ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరులు వేచి చూడాలనే ఆలోచనలో ఉన్నారు. గతంలో మదన్ లాల్ తో సన్నిహితంగా ఉండి రాములునాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వెంట వచ్చిన వారు నియోజకవర్గ వ్యాప్తంగా మరల మదన్ లాల్ వైపు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. మదన్ లాల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనను విభేదించిన ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వెంట ఉన్న నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలో మదన్ లాల్ వర్గీయులు, పొంగులేటి వర్గీయులు పోటాపోటీగా ఆపరేషన్ ఆకర్స్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని పొంగులేటి వర్గంలో ఉన్న కొంతమందిని తమ వైపునకు తిప్పుకునేందుకు మదన్ లాల్ వర్గీయులు ప్రయత్నిస్తున్నట్లు వైరాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఆపరేషన్ ఆకర్స్ తో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే వైరా నియోజకవర్గ రాజకీయాలు మరింత రంజుగా మారాయనటంలో ఎలాంటి సందేహం లేదు.