అజ్ఞాతంలో ఉండి సాధించేది ఏమీ లేదు : ఎమ్మెల్యే హరిప్రియ

by Sridhar Babu |
అజ్ఞాతంలో ఉండి సాధించేది ఏమీ లేదు : ఎమ్మెల్యే హరిప్రియ
X

దిశ, ఇల్లందు : అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు వారి సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడాలి కానీ ఎక్కడో అజ్ఞాతంలో ఉంటే సాధించేది ఏమీ ఉండదని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవిశ్వాసానికి గల కారణాలను పార్టీకి తెలిపి ప్రజాక్షేత్రంలో ఉండి కౌన్సిలర్లు పోరాటం కొనసాగించాలి కానీ అజ్ఞాతంలో ఉండి వాట్సాప్ మెసేజ్ ద్వారా పార్టీకి నష్టం జరిగే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఇల్లందు పట్టణంలో పట్టు కోసం పొంగిలేటితో కలిసి కొంతమంది కౌన్సిలర్లను ప్రోత్సహించడంతో మిగతా కౌన్సిలర్లు కూడా వారి మాటలను నమ్మి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఒకరిద్దరు వ్యక్తుల వల్ల మిగతా కౌన్సిలర్లు నష్టపోవద్దని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు.

కొండపల్లి గణేష్ అలియాస్ సిండికేట్ గణేష్ అనే వ్యక్తి ప్రలోభాలకు గురిచేసి కౌన్సిలర్లను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ తాత మధు పై అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు వాట్సాప్ మెసేజ్ లలో ఆయనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణ చేయడం మంచిది కాదన్నారు. మిమ్మల్ని కౌన్సిలర్లుగా గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉన్న ఎమ్మెల్సీ తాతా మధు ఇల్లందు పట్టణంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వ్యూహాత్మక రాజకీయాలను అమలు చేసి ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించడంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని గెలిపిస్తే ఆ వ్యక్తిపై ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం వల్ల ప్రెస్ మీట్ ద్వారా వారికి సందేశం పంపుతున్నామన్నారు. ఇప్పటికైనా అజ్ఞాతం వీడి వస్తే చర్చించుకొని సమస్యలు పరిష్కరిద్దామని కౌన్సిలర్లకు అల్టిమేటం జారీ చేశారు. అసమ్మతి కౌన్సిలర్లు రానట్లయితే రెండు మూడు రోజులు చూసి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మానసికశోభకు గురి చేయొద్దు : చైర్మన్ వెంకటేశ్వరరావు

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు భావోద్వేగం తో మాట్లాడుతూ ఇల్లందు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నానని రాష్ట్రస్థాయిలో 18వ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా మూడుసార్లు ఇల్లందుకు ఉత్తమ మున్సిపాలిటీ అవార్డులు తీసుకొచ్చామన్నారు. గత సంవత్సర కాలంలో కొంతమంది మహిళ కౌన్సిలర్లు తన ప్రవర్తనపై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఆర్డీవో సమక్షంలో జరిగిన ఎంక్వయిరీలో తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే దేనికైనా సిద్ధమన్నారు. ఆ కౌన్సిలర్ లందరూ నాకు సోదరిమణులని దాంట్లో కొంతమంది మాత్రం కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ తాను తప్పు చేశానని నిరూపిస్తే చైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు కొంతమంది తన వ్యక్తిగత జీవితంపై ప్రస్తావిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ వాట్సప్ మెసేజ్ లు చేస్తున్నారన్నారు. అజ్ఞాతం వీడి రావాలని, బహిరంగంగా కూర్చుందాం ఎవరి తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో ప్రజల మధ్య ,పార్టీ మధ్య తేల్చుకుందామని సవాల్ విసిరారు. పార్టీ ఆదేశానుసారం అజ్ఞాతంలో కి వెళ్లిన కౌన్సిలర్ల ఇంటిముందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే వాట్సాప్ గ్రూప్ లలో ఆ కౌన్సిలర్లు పట్టణంలోని నాయకులను చెంచాలుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ పార్టీ నాయకులు మాట్లాడకపోవడం తీవ్ర విచారకరమన్నారు. పట్టణంలో ఏ అభివృద్ధి పని జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే ఎమ్మెల్యే ఆదేశానుసారం ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భద్రాది కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, వైస్ చైర్మన్ జానీ, పులి గళ్ళ మాధవరావు, రంగనాథ్, యలమద్ది రవి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed