ప్రత్యర్థులెవరైనా సరే.. ఈసారి కమల వికాసమే: ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు

by Shiva |
ప్రత్యర్థులెవరైనా సరే.. ఈసారి కమల వికాసమే: ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు
X

ప్రత్యర్థులెవరైనా ఈ సారి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, మోడీ నిర్మించదలచిన రామరాజ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి రాబోయే పార్టీ ప్రతినిధిగా తనను గెలిపిస్తే ఖమ్మాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాని వెల్లడించారు. జిల్లాలో పరిష్కారం కాని అనేక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ‘దిశ’ ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

దిశ బ్యూరో, ఖమ్మం: మోడీ నాయకత్వంలో బీజేపీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ఖమ్మంలో బీజేపీ గెలుపు ఖాయమని పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు పార్టీలోకి అనేకమంది వస్తున్నారని, జిల్లాలో సైతం పార్టీ బలోపేతం అవుతుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే జిల్లాలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ‘దిశ’ ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు...

రాజకీయ జీవితం బీజేపీతోనే మొదలు..

పది సంవత్సరాలుగా నన్ను ప్రభావితం చేసింది భారతీయ స్వయం సేవక్ సంఘ్, వారి త్యాగాలు, దేశంపై వారి ప్రేమ ఎనలేదనివి.. అటువంటి భావజాలం ఉన్న ఎన్జీవోలకు ఎన్నో విధాలుగా సేవలు చేశాను. అదే క్రమంలో నరేంద్ర మోడీ భావజాలం నచ్చడం, వారి పాలనకు, వారు నిర్మిస్తున్న రామరాజ్యానికి ఆకర్షితుడనయ్యాను. నా ఖమ్మం జిల్లాకు సైతం సేవ చేయాలనే దృక్పథంతో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చాను. నేను గత పది సంవత్సరాలుగా ట్రైబల్, స్లమ్ డెవలప్ మెంట్లో అనేక సేవలు చేశాను. ఈ పదేండ్లలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. రీజినల్ పార్టీల్లో వారి కుటుంబ సభ్యులకు, కాకాపట్టిన వారికి పెద్దపీట వేస్తారు. కానీ బీజేపీలో అలాకాదు. పనిచేసేవారికి గుర్తింపు ఉందని, నాలాంటి వ్యక్తి బీజేపీలో చేరితే గుర్తింపు ఉంటుందని ఈ పార్టీలో చేరాను.

టికెట్ మీకే ఇవ్వడానికి కారణం..?

నేను ఎప్పుడయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నానో అప్పుడు కిషన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యాను. ఖమ్మం అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరినప్పుడు తమ పార్టీకి టికెట్ల కేటాయింపులో ఒక ప్రక్రియ ఉంటుందని, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేయగల్గుతారో.. ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారో వారికి టికెట్ కేటాయిస్తామన్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. నాకు మాత్రం టికెట్ కేటాయించారు. పార్టీలో జాయిన్ అయిన తర్వాత అందరం కుటుంబ సభ్యుల్లాంటోళ్లం. అన్యాయాన్ని కలిసికట్టుగా ఎదిరించాల్సిన అవసరం ఉంది. అన్యాయపు ప్రభుత్వాలపై పోరాడుతూనే ఉంటాం. మేమందరం రామరాజ్యం కోసం ప్రయత్నిస్తున్న మోడీ సైనికులం.

లోకల్ పార్టీ లీడర్ల సపోర్ట్ ..

జిల్లా నాయకుల సపోర్ట్ సంపూర్ణంగా ఉంది. అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. గతంలో ఎలా ఉన్నారు తెలియదు కానీ.. ఇప్పుడేతై జిల్లా నాయకులు అందరూ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. మేం ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో విశేష స్పందన వస్తోంది. కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటాం. ఎక్కడైనా ఏమైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దుకుంటాం. నేను రాకముందు జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తెలియదుకానీ.. ఇప్పుడు మాత్రం అందరం సమిష్టిగా ముందుకు సాగుతున్నాం. ప్రజలు సైతం ఈ సారి బీజేపీని గెలిపించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

కుటుంబ నేపథ్యం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ముల్కలపల్లి మండలం తిమ్మంపేట మాది. వ్యవసాయ కుటుంబం. 1920లోనే మాతాత మున్షి(ఇంటర్) చదివారు. పాల్వంచ సంస్థాన్ తహశీల్దార్ గా పనిచేశారు. 1930 భద్రాచలం ఆలయానికి ట్రస్టీగా ఉండేవారు. ఆయన చేతుల మీదుగానే ముత్యాల తలంబ్రాలు ఇచ్చేవారు. మా పెద్దనాన్న జడ్జీ, మా నాన్న అడ్వకేట్ గా పనిచేసేవారు. మా కుటుంబానికి ఆధ్మాత్మిక చింతన అధికంగా ఉండేది. మేం ఆ వాతావరణంలో పెరిగాం. దాంతో నాకూ ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగానే ఉన్నాయి. నేను టెన్త్ వరకు పాల్వంచలో, ఆ తర్వాత విజయవాడ, హైదరాబాద్ లో చదివాను. ఆ తర్వాత అమెరికాలో వెళ్లి, కొంతకాలం తర్వాత ఇండియాకే వచ్చేశాం. పలు వ్యాపారాలు చేసి రియల్ రంగంలో స్థిరపడ్డా. 2014లో బీజేపీ భావజాలానికి ఆకర్షితున్నై పలు సోషల్ సర్వీస్ చేశాను.

జిల్లాలో ప్రచార సరళి ..

నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నా. మొదట విడత పూర్తి చేసి, త్వరలోనే రెండో విడత కూడా స్టార్ట్ చేస్తాం. ఎక్కడికి పోయినా మాకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈసారి కూడా ప్రజలు నరేంద్రమోడీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా బీజేపీకే ఓటేస్తామంటున్నారు. ప్రజలందరూ దేశంలో నరేంద్రమోడీ రామరాజ్యాన్ని కోరుకుంటున్నారు. బీద, బడుగు, బలహీన వర్గాల వారు, అన్ని వర్గాల వారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నా ప్రచారానికి జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా తప్పకుండా వస్తారు. ఇప్పటి వరకు మోడీ ఖమ్మం జిల్లాకు రాలేదు.. ప్రధాని వచ్చే అవకాశం ఉంది.

ఎంపీగా గెలిస్తే జిల్లా ప్రజలకు ఏం చేస్తారు..?

ప్రచారంలో భాగంగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో నా దృష్టికి వస్తున్నాయి. వీటితో పాటు ప్రధానంగా భద్రాచలం-కొవ్వూరు రైల్వే ప్రాజెక్టు, ఎన్టీపీసీ అదనపు ప్రాజెక్టు, మరో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. గత పది సంవత్సరాల్లో ఖమ్మం జిల్లాకు ఏ జిల్లాకు ఏ ఒక్క ప్రాజెక్టు వచ్చిన దాఖలు లేవు. ఇచ్చే ప్రధాని ఉన్నా.. అడిగి తీసుకురావాలనే బాధ్యత లేనివారు గతంలో పనిచేశారు. ఆ పరిస్థితి ప్రజలు గమనించారు. ఈసారి ప్రగతికి, అభివృద్ధికి అవకాశం ఉండే బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఉంటే ఆయన ప్రతినిధిగా ప్రజలు గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ బాధ్యతగా అమలు చేస్తాను. ఇక మా పోటీ ధర్మానికి, అధర్మానికి.. న్యాయం, అన్యాయానికి.. పనిచేసేవాళ్లకు, పనిచేయనివాళ్లకు. ప్రత్యర్థులెవ్వరొచ్చినా మాది మొదటి స్థానమే. మాకు ప్రత్యర్థులు ఎవరనేదానిపై దృష్టి పెట్టలేదు.. కారణం ఈసారి బీజేపీ గెలవబోతోంది. ప్రజలు చాలా చైతన్యవంతులు . ఎవరేంటి అనేది ఇప్పటికే ప్రజలకు అర్థం అయిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో కమల వికాసం జరగబోతోంది.

జిల్లాలో బీజేపీకి నాయకత్వ లేమి..

అనేక కారణాల వల్ల బీజేపీ ఇక్కడ బలంగా పుంజుకోలేకపోయిందనేది వాస్తవమే. ఎవరైతే ఖమ్మం కమ్యూనిస్టుల కంచుకోట అనుకున్నారో వారే ఇప్పుడు నోరు మూసుకునే టైం వచ్చింది. ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణ చూస్తే అదే తేటతెల్లం అవుతోంది. ఒకవేళ ఇప్పుడు ఎంపీగా గెలిస్తే రానున్న రోజుల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పుంజుకోవడమే కాకుండా 7స్థానాలు సైతం గెలిచే అవకాశం ఉంది. ఈసారి ఒక్కసారి బీజేపీకి ఇవ్వండి. ఆ తర్వాత ప్రగతి చూడండి.

ప్రతిపక్షాల గురించి..?

ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం ప్రజలకు అన్నీ తెలిసిపోయాయి. వారు మోసపోయినట్లు గ్రహించారు. మేం అడగకుండానే ప్రజలు ఓట్లేస్తామని స్వచ్ఛందంగా చెబుతున్నారు. మేం ఇప్పుడు ప్రతిపక్షాల గురించి అవసరం లేదు.. ప్రజలు చాలా చైతన్య వంతుల. వారికి అన్నీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం గెలిస్తే ఏం చేస్తామనే చెబుతున్నాం. అన్ని నియోజకవర్గాల్లో త్వరలో పలు పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉన్నాయి. చాలామంది తెలుసుకుని బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed