ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి

by Sridhar Babu |
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి
X

దిశ బ్యూరో, ఖమ్మం : జిల్లాలో ఖరీఫ్ ధాన్యం పక్కా ప్రణాళికతో కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్దం కావాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూపొందించుకున్న ప్రణాళిక, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ మాసంలో ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందో మండలాల వారీగా ముందస్తుగానే ప్రణాళిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు వద్దే నాణ్యతను పరిశీలించాలని, రైస్ మిల్లుల్లో ఎటువంటి కోతలు ఉండడానికి వీలు లేదని అన్నారు.

ఖమ్మం జిల్లాలో మొత్తం 6 లక్షల 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, ఇందులో 4 లక్షల 29 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని తెలిపారు. వీటి కొనుగోలుకు 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంచనా వేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్న రకాల ధాన్యాలను కొనుగోలు కేంద్రాల బాధ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారితో సమన్వయం చేసుకుంటూ గుర్తించాలని, వీటిని కొనుగోలు చేసిన తర్వాత కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. అక్టోబర్ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు.

నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర మొదలైన అంశాలను వివరిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజూ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన నివేదిక సమర్పించాలని, కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ ఆర్. సన్యాసయ్య, డీసీఎస్ఓ. కె. చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా రవాణాధికారి వి. వెంకట్ రమణ, లీగల్ మెట్రాలజీ డీఎల్ఎంఓ ఐ. విజయ్ కుమార్, డీఎంఓ అలీం, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె. సందీప్, డీసీఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎండీ. ఆసిఫ్ అన్వర్, ఎఫ్సీఐ మేనేజర్ కేఎన్. రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ మహమ్మద్ నూరుద్దీన్, డీపీఎం బి. దర్గయ్య, అధికారులు పాల్గొన్నారు.

Next Story