మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా ఇరికించారు : ఎమ్మెల్యే రాములు నాయక్

by Sridhar Babu |   ( Updated:2023-03-11 15:32:29.0  )
మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా ఇరికించారు : ఎమ్మెల్యే రాములు నాయక్
X

దిశ, వైరా : మద్యం కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఇరికించిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. కొణిజర్ల లోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సాయంత్రం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై 72 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 72 లక్షలు విలువైన చెక్కులను, 35 మంది అనారోగ్య బాధితులకు రూ. 10.32 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాములు నాయక్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్సీ కవితపై అక్రమంగా, ఉద్దేశపూర్వకంగా మద్యం స్కాం కేసు బనాయించడం అప్రజాస్వామికమన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. దేశంలో మత ద్వేషాన్ని రెచ్చగొట్టటమే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను దొడ్డిదారిన బీజేపీ కూల్చివేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా వైరా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావటం లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆర్థిక చేయూతనందిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలందరూ సంఘటితంమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఒకే రోజు కొనిజర్ల మండలంలోని 107 మంది లబ్ధిదారులకు 82.32 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో కొనిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, తహసీల్దార్ సైదులు, బీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, చెరుకుమల్లి రవి, ఏలూరు శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed