సొంత పార్టీ నేతలకు BRS MLA రాములు నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్

by Mahesh |   ( Updated:2023-01-08 14:30:49.0  )
సొంత పార్టీ నేతలకు BRS MLA రాములు నాయక్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వైరా: నేను ఇప్పటివరకు సాఫ్టవేర్ లా వున్నా... వైరా నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారితే నేను హార్డ్వేర్ గా మారి పోవాల్సి వస్తుంది.... లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా నా చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే ప్రోటోకాల్ తో పాటు గౌరవం ఉంటుంది... పార్టీ నుంచి వేరు పడాలని చూస్తే చూస్తూ ఊరుకోనంటూ వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదిక అయింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని ముమ్మర ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం వైరా నియోజకవర్గంలో తీవ్ర దుమారం లేపుతుంది.

వైరా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని బి ఆర్ ఎస్ నాయకులు , మున్సిపాలిటీ కౌన్సిలర్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేక అంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ఒకింత ఆవేశ పూర్వకంగా ప్రసంగించారు. ఇప్పటివరకు ఒక ఎత్తు... ఇప్పటినుంచి మరో ఎత్తు అనే చందంగా ఎమ్మెల్యే ప్రసంగం కొనసాగింది. ఇప్పటివరకు మనమంతా ఒక బీఆర్ఎస్ కుటుంబంగా కొనసాగామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించబోమని, చూస్తూ ఊరుకోలేనని హెచ్చరించారు. ఇప్పటివరకు అందరూ ఉమ్మడి కుటుంబంలా ఉన్నామని, అలాగే కొనసాగితే గెజిటెడ్ ఆఫీసర్లలా ప్రోటోకాల్ తో పాటు పార్టీలో గౌరవం లభిస్తుందని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు తాను ఎవ్వరిని కించపరచలేదని, అగౌరవంగా చూడలేదని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని అక్రమంగా కబళించాలని చూస్తుందని వివరించారు. మనందరి నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. కెసిఆర్ దూకమంటే తాను చెరువులో దూకుతానని పేర్కొన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్‌కు శత్రువులైన ప్రతి ఒక్కరూ తనకు శత్రువులేనని స్పష్టం చేశారు.

ఇప్పటికే బీజేపీ ఇన్చార్జిలు అని చెప్పుకుంటూ వైరా నియోజకవర్గంలో కొంతమంది పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తే ఇప్పటి వరకు నేను సాఫ్ట్వేర్ లా ఉన్న... హార్డ్వేర్ గా మారాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ మన అందరి చేతుల్లో ఉందని చెప్పారు. పరిణామాలు మారితే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ పార్టీలోకి వెళ్లి ఇబ్బందులకు గురి కావద్దని పరోక్షంగా పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు.

కౌన్సిలర్ల గైర్హాజరపై చైర్మన్, వైస్ చైర్మన్‌కు క్లాస్..

ఈ అంతరంగిక సమావేశానికి వైరా మున్సిపాలిటీ లోని కొంతమంది కౌన్సిలర్లు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సానుభూతి కౌన్సిలర్లు మొత్తం 18 మంది ఉన్నారు. వారిలో 12 మంది కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాములు నాయక్ మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములకు క్లాస్ తీసుకున్నారు. మీరు కౌన్సిలర్లతో సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.

సమావేశానికి కౌన్సిలర్లు వస్తున్నారా లేదా అని ముందస్తు సమన్వయం గా మాట్లాడలేదని ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలవల్ల ఆరుగురు కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేకపోయారని జైపాల్, ముళ్ళపాటి సీతారాములు ఎమ్మెల్యే కు వివరించారు. దీంతో శాంతించిన ఎమ్మెల్యే వీలైనంత తొందరలో కౌన్సిలర్లు అందరితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ సమావేశానికి తాను హాజరై కౌన్సిలర్లతో విపులంగా మాట్లాడుతానని చెప్పారు.

Advertisement

Next Story