ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీ

by Sridhar Babu |   ( Updated:2023-09-14 12:33:09.0  )

దిశ, బ్యూరో ఖమ్మం : రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వానిదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం వర్చువల్ గా 9 జిల్లాల్లో సీఎం కేసీఆర్ తరగతులు ప్రారంభిస్తారని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వచ్చిన మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తొలుత ఖమ్మం పాత కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. కళాశాలలో ఏర్పాట్లను వసతి, సదుపాయాలను, ఫ్యాకల్టీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మమత మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్మితమైన జూబ్లీ బ్లాక్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ తనయుడు నయన్ రాజ్, దివంగత పువ్వాడ ఉదయ్ కుమార్ తనయుడు నరేన్ మెడికల్ కళాశాల వివరాలను, అందిస్తున్న సేవలను, వైద్య విద్యార్థుల తరగతుల గురించి వివరించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ రోజు ఖమ్మంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నామని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన ప్రారంభోత్సవంతో పాటు మమత మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు.

నాన్ మైనార్టీ కాలేజీగా ఉండి 25 ఏళ్లుగా ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా చుట్టు పక్కల జిల్లా ప్రజలకు వైద్య సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. పేదలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చి వేలాది మంది ప్రాణాలు కాపాడిన మమత యాజమాన్యాన్ని, సిబ్బందిని, వైద్య విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువని, అందువల్లే వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యనభ్యసించేందుకు వస్తున్నారని తెలిపారు. దేశంలో దాదాపు 43 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణలోనే అందుబాటులో ఉన్నాయని, ఏటా పది వేల మంది వైద్య విద్యార్థులు వైద్య సేవలందించేందుకు విద్యను పూర్తిచేసుకుని వస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు వల్ల, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. ఎవరు దరఖాస్తు పెట్టినా మెడికల్ కళాశాలలకు

అనుమతులిస్తున్నామని, మోకాలడ్డే పరిస్థితులు లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు సహకరిస్తున్నామని వెల్లడించారు. తాను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నోసార్లు కోరారని, ఆయన కోరికను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఓకే చేయించామని చెప్పారు. అజయ్ కోరుకున్న విధంగా నేడు ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకుడు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షులు తెలిపి, శాలువాతో సత్కరించారు.

చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నా..

రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే ఉంటాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం దారుణమని, ఈ విషయాన్ని ఖండిస్తున్నాని తెలిపారు. ప్రతిపక్ష నేతలను జైళ్లలో వేసే పరిస్థితి తెలంగాణలో లేదని, స్వేచ్ఛగా ఎవరి భావాలు వారు వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా సీఎం కేసీఆర్ ఉదారత వల్ల మనగలుగుతున్నారని పేర్కొన్నారు. 25 సంవత్సరాల క్రితం ప్రైవేట్ రంగంలో తమ నాన్న పువ్వాడ నాగేశ్వరరావు దూరచూపు వల్ల మమత మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. తర్వాత అనేక ఇబ్బందులు,

ఒడిదొడుకులు వచ్చినా తట్టుకుని నిలబడ్డామని తెలిపారు. కళాశాలను మూయించేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అయినా ఛేదించుకుని పలువురు నాయకుల సహకారం అందుకుని నిలదొక్కుకున్నామని చెప్పారు. కళాశాల అనుమతుల విషయంలో చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ఎంతో సహకరించారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నదని చెప్పారు. 2018లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే బాచుపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామని చెప్పారు. తమ కళాశాలలో మెడికల్, డెంటర్, నర్సింగ్ విభాగాలు ఉన్నాయని, ప్రతీ ఏటా ఇక్కడ చదివు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరావు, తాత మధుసూదన్, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story