మనిషి మనుగడకు మొక్కలు అవసరం : మంత్రి పొంగులేటి

by Sridhar Babu |
మనిషి మనుగడకు మొక్కలు అవసరం :  మంత్రి పొంగులేటి
X

దిశ,సత్తుపల్లి : భవిష్యత్ తరాలకు మంచి చేయాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార ఫౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. అటవీశాఖచే గొల్లగూడెంలోని అటవీ భూమిలో 33,320 మొక్కలు నాటే కార్యక్రమంను మంత్రులు చేపట్టారు. అనంతరం అటవీ ఉత్పత్తుల స్టాల్, ఫొటో ప్రదర్శనను మంత్రులు తిలకించారు. అనంతరం మంత్రులు సత్తుపల్లి లోని జలగం వెంగళరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల చేరుకొని, వనమహోత్సవం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మనిషి మనుగడ కు పచ్చదనం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆరోగ్యంగా పూర్వం వందేళ్లు బతికారంటే దానికి చెట్లే కారణమన్నారు. మొక్క నుండి చెట్టు వరకు మనిషికి ఎంతో అవసరమైనదని ఆయన తెలిపారు. పచ్చదనం గొప్పతనం ప్రతిఒక్కరికి తెలియాలన్నారు.

పచ్చదనం లోకి వెళ్తే ఒత్తిడికి దూరమై ప్రశాంతత చేకూరుతుందన్నారు. మొక్క నుండి చెట్టుకు ఎదగాలంటే ఎంతో శ్రమ అవసరమని, అదే చెట్టును నరకాలంటే ఒక్క క్షణం ఆలోచించాలని ఆయన అన్నారు. పచ్చని చెట్లను పెంచితే తప్ప, మనిషికి మనుగడ లేదని అన్నారు. ఒక్కో వ్యక్తి ఒక మొక్క నాటి సంరక్షించాలని, వారు పది మందికి మొక్కలు నాటాలనే సంకల్పం కల్పిస్తే వన మహోత్సవం విజయవంతం అవుతుందని అన్నారు. గడిచిన 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ ఫౌండేషన్ పేరుతో చేపడుతున్న స్వచ్ఛంద కార్యక్రమాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని, అన్ని కులాలు, మతాల సమతుల్యత పాటిస్తూ అభివృద్ధిపథంలో పయనిస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు పెంచాలన్నారు. ఇండ్లు, అభివృద్ధి పనులకు పెద్ద పెద్ద వృక్షాలు తొలగిస్తున్నామని, చల్లని నీడనిచ్చే చెట్లు కనుమరుగు అవుతున్నాయని అన్నారు. 1959 లో కేంద్రమంత్రి కేఎం. మున్షి వనమహోత్సవానికి నాంది పలికారని,

ఇప్పుడు మనకు వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమమని ఆమె అన్నారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకొని, ప్రతి జిల్లాకు ఒక లక్ష్యం పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 14 వేల నర్సరీల్లో 22 కోట్ల మొక్కలను సిద్ధం చేశామన్నారు. ప్రతి శాఖకు లక్ష్యం మేరకు మొక్కలు నాటుటకు ఏర్పాట్లు చేశామన్నారు. మొక్కను నాటి, సంరక్షిస్తే జీవితకాలం ఆక్సిజన్ తోపాటు, పండ్లు, ఫలాలు అందిస్తామన్నారు. ఇండ్లలో అడిగిన మొక్కను ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఇంటిముందు మల్లె, జాజి పూల పందిల్లు ఉండేవని, వాకిట్లో ముగ్గులు వేసేవారని, పండుగ వచ్చిందంటే పల్లెల్లో శోభ వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. మన ఇల్లు ఒక్కటే బాగుంటే సరిపోదని, సమాజం, గ్రామం బాగుండాలని అన్నారు. ప్రజలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. అంగన్వాడీ, ఆశాలు, అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి, గ్రామ గ్రామాన మొక్కలు నాటాలని అన్నారు. అడవుల్లో ఉన్న కోతులు బయటకు రాకుండా, అడవుల్లోపల ఫలాలను ఇచ్చే మొక్కలు నాటాలని, వీటితో కోతులు బయటకు రాకుండా ఉండడంతో పాటు,

గిరిజనులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలన్నా, పర్యావరణ పరిరక్షణ జరగాలన్నా మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ సత్తుపల్లి సింగరేణి ప్రభావిత ప్రాంతమని, వాతావరణ కాలుష్యం ఎంతో ఉంటుందని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరిగితే వర్షాలు పడవని, పంటలు పండక, ఆహార కొరత ఏర్పడుతుందని అన్నారు. గత 15 సంవత్సరాల నుండి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు కళాశాల, పాఠశాలల విద్యార్థులు జాతీయపతాకం చేతబూని స్వాగతం పలికారు. ఎన్ సీసీ విద్యార్థులు స్వాగతం పలుకగా కొమ్ముడోలు కళాకారులు నృత్యంతో అలరించారు. పచ్చ పచ్చని పల్లె పాటకు పాఠశాల విద్యార్థినులు వేసిన నృత్యం ఆకట్టుకుంది.అనంతరం వనమహోత్సవం పై అవగాహనకు చేపట్టిన ర్యాలీని మంత్రులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి అహ్మద్ నదీమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, కొత్తగూడెం సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి డి. భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ ఎస్. వినోద్, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, సత్తుపల్లి బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కె. మహేష్, ప్రకృతి కవి జయరాజ్, మట్టా దయానంద్, మువ్వా విజయ్ బాబు, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story