పదవులతో వైరాకు వన్నెతెస్తున్న మల్లు సోదరులు

by Sumithra |
పదవులతో వైరాకు వన్నెతెస్తున్న మల్లు సోదరులు
X

దిశ, వైరా : వైరా మండలంలోని అతి చిన్న గ్రామమైన స్నానాల లక్ష్మీపురంకు చెందిన మల్లు కుటుంబ సభ్యులు 1980 సంవత్సరం నుంచి నేటి వరకు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఆ కుటుంబంలోని ముగ్గురు సోదరులు అనేక పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నెతెస్తున్నారు. ఒకటి కాదు... రెండు కాదు.. ఆ సోదరులు ఇప్పటివరకు అనేక పదవులు అధిరోహించారు. వారు జన్మించిన స్నానాల లక్ష్మీపురం గ్రామంతో పాటు వైరా పేరును, ఖ్యాతిని నాలుగు దిక్కుల చాటి చెబుతున్నారు. వారే వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మల్లు అఖిలాండ దాసు, మణెమ్మ దంపతుల కుమారులు మల్లు అనంత రాములు, మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్క.

వీరు ముగ్గురు రాజకీయాల్లో రాణించి దేశ స్థాయిలోనే వైరాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 1980 సంవత్సరంలో ఎంపీగా గెలుపొందిన మల్లు అనంత రాములు అంచలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. 1991 లో ఎంపీగా గెలుపొందిన మల్లు రవి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధులు నిర్వహించారు. 1994లో ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మల్లు భట్టి విక్రమార్క అంచలంచెలుగా ఎదిగి నేడు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసి కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పదవులు అలంకరించారు.

పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లు అనంతరాములు..

1943 సంవత్సరంలో జన్మించిన మల్లు అనంతరాములు హై స్కూల్ స్థాయి వరకు విద్యను అభ్యసించారు. అనంతరం కొన్ని సంవత్సరాలు ప్రభుత్వ విఎల్ డబ్ల్యూగా విధులు నిర్వహించారు. 1979 వ సంవత్సరంలో జలగం వెంగళరావుని చూసి రాజకీయాల్లోకి ఆకర్షితులయ్యారు. 1980 వ సంవత్సరంలో ఇందిరాగాంధీ, ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆశీస్సులతో మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి మల్లు అనంత రాములు పోటీ చేసి విజయం సాధించి లోక్ సభ లో అడుగు పెట్టారు. 1985లో జరిగిన పార్లమెంటు ఎన్నికల వరకు ఆ నియోజకవర్గం పార్టీతో పాటు గ్రామాలలోని బలహీన వర్గాల వారికి ఎన్నో సహాయ సహకారాలు అందించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆ తర్వాత 1985లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి మరో సారి పోటీచేసి తెలుగుదేశం ప్రభంజనంలో ఓటమి చెందినారు.

1987లో కేంద్ర ప్రభుత్వంచే అఖిల భారత వ్యవసాయ క్షేత్రాల అధ్యక్షునిగా నియమింపబడ్డారు. అనంతరం పార్టీ పటిష్టత కొరకు ఈశాన్యరాష్ట్రాలకు ఇన్చార్జిగా ఏఐసీసీ సహాయ కార్యదర్శి హోదాలో నియమించబడ్డారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుమారి కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయించారు. 1990లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ గెలుపుకు కృషి చేశారు. ఆ తర్వాత అనంత రాములు ఎఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి కాంగ్రేస్ గెలిపించుటకు శక్తివంచన లేకుండా పనిచేసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటానికి కృషి చేశారు. తిరిగి నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యునిగా ఎన్నికై రెండవసారి పార్లమెంటులో ప్రవేశించారు. ఆ తర్వాత రెండు నెలలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షునిగా ఎఐసీసీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీచే నియమించబడ్డారు. రెండు నెలలు పీసీసీ అధ్యక్ష స్థానములో కొనసాగిన మల్లు అనంత రాములు 1990 ఫిబ్రవరి 7వ తేదీన మరణించారు.

ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన మల్లు రవి...

1950 జులై 14న జన్మించిన మల్లు రవి నిజాం వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారు. అంతకుముందే అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ శాఖామాత్యులు కోనేరు రంగారావు కూతురు రాజబన్సీదేను వివాహమాడారు. మల్లు అనంతరాములు మరణాంతరం నాగర్ కర్నూల్ లోకసభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా 1991లో విజయం సాధించి రాజకీయంలోనికి అడుగుపెట్టారు. తర్వాత 1991 నుండి 1994 వరకు ఎగ్జిక్యూటివ్ పార్లమెంటరీ పార్టీ తరపున పనిచేసినారు. 1996 నుండి ఎఐసీసీ మెంబరుగా పనిచేశారు. 1998 - 1999 లో పార్లమెంటు మెంబర్ పనిచేశారు. 2002 - 2004 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. అఖిలభారత కాంగ్రెసు కమిటీ అబ్జర్వరుగా, ఒరిస్సా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బాధ్యతలు నిర్వహించారు. 2004లో బీఆర్ఎస్తో పొత్తువల్ల ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లు రవిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. మనరాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టుకు క్లియరెన్సులు మంజూరి కొరకు కేబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు. 2008 మధ్యంతర ఎన్నికలలో జెడ్చర్ల నుండి శాసనసభ్యులుగా విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా కొనసాగుతున్నారు.

ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు బట్టి విక్రమార్క...

1961 జూన్ 15వ తేదీన జన్మించిన మల్లు భట్టి విక్రమార్క ఎంఏ వరకు విద్యను అభ్యసించారు. 1994 ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2004వ సంవత్సరంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ను ఆశించి భంగపడ్డారు. 2007వ సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2009వ సంవత్సరంలో మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్కను ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించారు. 2014, 2018, 2023 లో జరిగిన ఎన్నికల్లో మధుర ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. మధుర ఎమ్మెల్యేగా వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన బట్టి విక్రమార్క రికార్డు సృష్టించారు. డిప్యూటీ స్పీకర్ గా, సీఎల్పీ నేతగా పనిచేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇలా మల్లు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించి తమ స్వస్థలమైన స్నానాల లక్ష్మీపురం కీర్తిని నలుదిక్కుల చాటి చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed