cannot be done by BJP alone : రుణమాఫీ చేయడం బీజేపీకే చేతకాదు

by Sridhar Babu |   ( Updated:2024-07-18 16:05:04.0  )
cannot be done by BJP alone : రుణమాఫీ చేయడం బీజేపీకే చేతకాదు
X

దిశ,మణుగూరు/పినపాక : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రుణమాఫీ చేయడం చేతకాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కోసం రుణమాఫీ చేస్తే విమర్శలు చేయడం సిగ్గుచేటని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రుణమాఫీలు చేయడం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే తప్ప మరి ఏ ప్రభుత్వానికి చేతకాదని అన్నారు. గురువారం పినపాక మండల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, ఎక్కడైనా రైతు రుణమాఫీ చేసిందా..? అని కమలంపై ఘాటు విమర్శలు కురిపించారు. అన్నం పెట్టే రైతన్న సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. రైతును అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం రైతు రుణమాఫీ పథకమని తెలిపారు. నేడు ప్రజా ప్రభుత్వ పాలనలో ఎంత కష్టమైనా,ఎంత భారమైనా,ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందన్నారు. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రూ.లక్ష వరకు రుణాలు గురువారం రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. రైతు పాస్​బుక్ ఆధారంగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ నాయకులు రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓట్లతో గెలిచిన ఎంపీలు రైతు రుణమాఫీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, యువజన కాంగ్రెస్ నాయకులు కొరసా ఆనంద్, నియోజకవర్గం ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed