ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం..

by Sumithra |
ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం..
X

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీపీ సోయం ప్రసాద్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు గత మూడునెలల్లో జరిగిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంలో వైద్యశాఖకు సంబంధించిన నివేదికను పట్వారిగూడెం వైద్యాధికారి దివాకర్ చదివి వినిపిస్తుండగా జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు బుడే వైద్యాధికారి దివాకర్ పై ఫైర్ అయ్యారు. గత కొన్ని రోజుల క్రితం పట్వారి గూడెం వైద్యశాలలో ప్రసవం కొరకు ఓ మహిళ వైద్యశాలకు వస్తే ఎందుకు పట్టించుకోలేదని, మీరు కనీసం రోగులు చేయి కూడా పట్టుకొని పరీక్షించారంట కదా ! ప్రసవానికి వచ్చిన మహిళ పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారు ? ప్రసవం జరిగే సమయంలొ వైద్యశాలలో ఎందుకు ఉండలేకపోయారు ? అని వైద్య అధికారి పై ఫైర్ అయ్యారు. తమ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి మీరు అవసరం లేదని, ఉన్నతాధికారులతో మాట్లాడి ఇక్కడ వేరే వారిని నియమించుకుంటామని అన్నారు.

అనంతరం వైస్ఎంపీపీ దారా మల్లికార్జునరావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని, కనీసం మండలంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేపడుతున్న, ఆ శాఖ అధికారులు పనులు సక్రమంగా చేయడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చేపడుతున్నారో కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదని, మండల కేంద్రంలో నిర్మించిన సీసీ రోడ్లు ఎక్కడెక్కడ నిర్మించారో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, వర్షపు నీరు వెళ్లకుండా, ఆ నీరు వెళ్ళేటట్లు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని, వాటికి తక్షణమే అధికారులు సమాధానం చెప్పి వర్షపు నీరు వెళ్లే విధంగా చూడాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో ఉన్న బీసీ కుల వృత్తుల దారులు రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, తహసిల్దార్ స్వామి వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story